Jagan: వైసీపీ ఆవిర్భవించి మూడు ఎన్నికలు జరిగాయి. మూడు ఎన్నికల్లోనూ ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయింది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం అధికం. అందుకే ఆ సామాజిక వర్గం నేతలను బరిలో దించిన వైసీపీకి లాభం లేక పోయింది. అందుకే ఇప్పుడు జగన్ వ్యూహం మార్చారు. కొత్తగా రెడ్డి సామాజిక వర్గం నేతను బరిలో దించారు. మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేశారు యెడం బాలాజీ. ఎన్నారై గా గుర్తింపు పొందిన బాలాజీని అనూహ్యంగా ఎంపిక చేశారు జగన్. అప్పటివరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఆమంచి కృష్ణమోహన్ ఉండేవారు. చీరాలకు చెందిన ఆయన అయీష్టతగానే పర్చూరు బాధ్యతలు చూసుకునేవారు. అయితే చీరాల టికెట్ ఆశించిన కృష్ణమోహన్ కు జగన్ చాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అందుకే పర్చూరుకు కొత్త అభ్యర్థిని వెతకాల్సి వచ్చింది. ఎన్నారై ఎడం బాలాజీ ని రంగంలోకి దించారు జగన్. కానీ లాభం లేకుండా పోయింది. టిడిపి అభ్యర్థి ఏలూరు సాంబశివరావుకు ఎదురులేకుండా పోయింది. హ్యాట్రిక్ విజయంతో నియోజకవర్గంలో ఆయన దూసుకుపోతున్నారు. ఆయనకు చెక్ చెప్పాలంటే బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న గాదె మధుసూదన్ రెడ్డి సరిపోతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టారు.
* వెంకట్ రెడ్డి సొంత నియోజకవర్గం
మాజీమంత్రి గాదె వెంకట్ రెడ్డి సొంత నియోజకవర్గం పర్చూరు. పలుసార్లు ఎమ్మెల్యే గెలిచిన వెంకట్ రెడ్డి మంత్రిగా కూడా సేవలందించారు. నియోజకవర్గంలో ఆ కుటుంబానికి సొంత క్యాడర్ అంటూ ఉంది. వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి కొత్త మైలేజ్ వస్తుందని జగన్ బలంగా నమ్ముతున్నారు. వైసిపి ఆవిర్భావం నుంచి ఇంతవరకు పర్చూరు నియోజకవర్గంలో బోణి కొట్టలేదు. వరుస ఓటములతో నియోజకవర్గంలో వైసిపి బలహీనపడుతోంది. అందుకే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గాదె మధుసూదన్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు కట్టబెట్టారు.
* తెలుగుదేశం పార్టీ హవా
పర్చూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో టిడిపి దే హవా. టిడిపి ఏడు సార్లు విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు గెలుపొందింది. వైసీపీకి ఇంకా గెలుపు తట్టలేదు. అయితే ప్రతి ఎన్నికల్లోను ఈ నియోజకవర్గ విషయంలో ప్రయోగాలు చేస్తున్నారు జగన్. కానీ ఓటమి ఎదురవుతోంది. ఎన్నికల సమయంలో వచ్చిన కొత్త నేతను స్థానిక క్యాడర్ వ్యతిరేకించడంతోపాటు సదరు అభ్యర్థికి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు అవగాహన చేసుకునేందుకు సమయం చాలడం లేదు. అందుకే నియోజకవర్గంలో ఒక్కసారి కూడా వైసిపి విజయం సాధించలేకపోయింది. పైగా టిడిపి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు జోరు మీద ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయనే గెలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం నిలబడగలిగారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 24 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
* ఆ నియోజకవర్గాలపై ఫోకస్
జగన్ ప్రధానంగా వైసిపి గెలుపొందని నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఆయన పర్చూరు పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పర్చూరు గెలవాల్సిందేనని గట్టిగానే భావిస్తున్నారు. అందుకే బలమైన రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి గాదె మధుసూదన్ రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. లోకల్ వ్యక్తి కావడంతో చొచ్చుకు పోతారని.. పాత క్యాడర్ కసితో పని చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.