Keshineni Nani : టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని యవ్వారం ఏదో సంచలనంతో కానీ ఫుల్ స్టాప్ పడే అవకాశం లేనట్టుగా కనిపిస్తోంది. రెండోసారి ఎంపీ అయిన నాటి నుంచి ఏదో విధంగా నాని వార్తల్లోకి ఎక్కుతున్నారు. పార్టీతో పాటు అధినేత తీరుపై అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగని పార్టీని వీడడం లేదు. తొలుత బీజేపీలోకి వెళతారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వస్తే వైసీపీలో చేర్చుకుంటామని ఆహ్వానాలు వస్తున్నాయి. నాని మాత్రం తాను ఇండిపెండెంట్ గానైనా పోటీచేసి గెలిచే సత్తా ఉందని చెబుతున్నారు. కానీ అల్టిమేట్ గా ఆయన వ్యవహార శైలితో పార్టీ చేటు తెచ్చే విధంగా ఉంది.
విజయవాడ లోక్ సభ స్థానం హాట్ సీటు. గత రెండుసార్లు వైసీపీ గట్టిగా ప్రయత్నించినా సీటును దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది. అదే సమయంలో సిట్టింగ్ స్థానం విషయంలో టీడీపీలో భిన్న వాతావరణం నెలకొంది. బలంగా ఉన్నా ఎంపీ వ్యవహార శైలి మింగుడుపడడం లేదు. ఆయనకు జిల్లా నేతలతో అస్సలు పొసగదు. దీంతో ఇరు వర్గాలను సముదాయిస్తున్నారే తప్ప చంద్రబాబు ఏ వర్గంపై బాహటంగా చర్యలకు దిగడం లేదు. కానీ తనకు ప్రత్యామ్నాయం సిద్ధం చేయడంపై కేశినేని నాని చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారు. కానీ ఎక్కడా బహిరంగ వ్యాఖ్యానాలు చేయడం లేదు.
టీడీపీలో ఉంటూనే ఒక రకమైన వ్యతిరేక కార్యక్రమాలకు సిద్ధపడ్డారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ టికెట్‌ను పిట్టలదొరకెవరికో కేటాయిస్తారని, తాను స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి గెలుస్తానని ప్రకటించారు. కేశినేని వ్యాఖ్యలు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుపై కేశినేని ప్రశంసలు కురిపించడం, ఆ వెంటనే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు చేయడం తెలిసిందే.
తాజాగా బుద్ధా వెంకన్న మీడియా ముందుకు వచ్చారు. తాను కేశినేని నాని గురించి ఎలాంటి కామెంట్స్ చేయనంటూనే..చంద్రబాబును ఏమైనా అంటే మాత్రం ఊరుకోనేది లేదని గట్టిగా హెచ్చరించారు. చంద్రబాబును అన్న మరుక్షణం దాడికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. అటు హైకమాండ్ సైతం దాని గురించే ఎదురుచూస్తోందని చెప్పకనే చెప్పారు. మొత్తానికైతే టీడీపీలో కేశినేని నాని వ్యవహారం ఫైనల్ కు వచ్చినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నాని ప్రతికూల ప్రకటన చేసిన మరుక్షణం కఠిన చర్యలకు ఉపక్రమించే చాన్స్ కనిపిస్తోంది.