Jagan: మాజీ సీఎం జగన్ తన రాజగురువును మార్చేశారు. ఇంతవరకు విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందను రాజ గురువుగా భావించేవారు. మొదట తన మిత్రుడు కేసిఆర్ కు యజ్ఞ యాగాదులపై చాలా నమ్మకం. ఆయనకు అలా పరిచయం అయిన వారే విశాఖ శారదా పీఠాధిపతి. అందుకే 2014 ఎన్నికలకు ముందు శారదా పీఠాధిపతితో పూజలు చేయించుకున్నారు కేసీఆర్. దీంతో అధికారం సిద్ధించింది. కానీ ఏపీలో తన మిత్రుడైన జగన్ కు అధికారం చిక్కలేదు. దీంతో జగన్ కు స్వామి స్వరూపానందను పరిచయం చేశారు కేసీఆర్. జగన్ విపక్షంలో ఉండగా ఆయన కోసం విపరీతంగా యజ్ఞ యాగాలు చేశారు స్వామీజీ. ఆ పూజలు ఫలించి జగన్ కు అధికారం దక్కింది. అప్పటినుంచి జగన్ కు స్వామి స్వరూపానంద రాజ గురువుగా మారిపోయారు. విశాఖ శారదా పీఠానికి వైసీపీ శ్రేణుల తాకిడి పెరిగింది. స్వామీజీ కోరికలను ఏపీ ప్రభుత్వం సమర్పించింది. వందల కోట్ల రూపాయల భూములను కేటాయించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామీజీకి అత్యంత గౌరవం దక్కేది. ఆయన వచ్చారంటే క్యాబినెట్ మంత్రి హోదాలో ప్రోటోకాల్ దక్కేది. కానీ ఇప్పుడు జగన్ అధికారానికి దూరం కావడంతో రాజ గురువుకు ప్రాధాన్యత తగ్గింది. ఇచ్చిన భూములు వెనక్కి వెళ్లాయి. టీటీడీలో గౌరవ మర్యాదలు తగ్గుముఖం పట్టాయి.
* విజయవాడ ఆశ్రమానికి
ఇప్పుడు జగన్ తాజాగా కొత్త గురువును వెతుక్కున్నారు. విశాఖ ప్రయాణం కష్టం కావడంతో విజయవాడలోని ఓ ఆశ్రమంతో సర్దుబాటు చేసుకున్నారు. స్థానికంగా ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న విధు శేఖర్ భారతి స్వామి అనే స్వామీజీ దగ్గరకు వెళ్లారు. ఆయనతో ఏకాంతంగా గంటన్నర పాటు చర్చలు జరిపారు. వై వి సుబ్బారెడ్డి మధ్యవర్తిత్వంతో జగన్ ఆ స్వామీజీని కలిసి నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రాజ గురువు స్వరూపానందనం మార్చేయడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీని వెనుక రకరకాల చర్చ నడుస్తోంది.
* హిందూ ఇమేజ్ కోసమే
ఆ మధ్యన తిరుమల లడ్డు వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డిక్లరేషన్ అడగడంతో జగన్ శ్రీవారి దర్శనాన్ని కూడా రద్దు చేసుకున్నారు. దీంతో అప్పట్లో జగన్ పై మత ముద్రపడింది. హిందూ సమాజంలో ఒక రకమైన భిన్న అభిప్రాయం ఏర్పడింది. ఆ హిందూ ఇమేజ్ కోసమే జగన్ కొత్త స్వామీజీని ఆశ్రయించినట్లు సెటైర్లు పడుతున్నాయి. ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అప్పట్లో తన హిందూ ఇమేజ్ కోసం స్వామి స్వరూపానంద తో పాటు చిన్న జీయర్ స్వామి కాళ్ళను మొక్కి.. తాను హిందువునేనని సంకేతాలు పంపేవారు. ఇప్పుడు భారీగా డ్యామేజ్ జరగడంతో ఇలా కొత్త స్వామీజీని ఆశ్రయించారన్నమాట.