Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా డిప్యూటీ సీఎం ఫేషికి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ నిన్న బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగింది. డిప్యూటీ సీఎం ఫేషి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర డిజిపి ద్వారకాతిరుమల స్పందించారు. పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో 24 గంటల వ్యవధిలోనే పవన్ ను చంపేస్తామంటూ బెదిరించిన నిందితుడిని గుర్తించడంతో పాటు అరెస్టు కూడా చేశారు ఏపీ పోలీసులు. అయితే అతడు గతంలో చాలామంది ప్రముఖులను సైతం ఇదే మాదిరిగా బెదిరించినట్లు సమాచారం. నిన్న రోజంతా పవన్ కు వచ్చిన బెదిరింపులే చర్చకు దారి తీసాయి. హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో తన ప్రాణానికి హాని ఉందని పవన్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ హెచ్చరికలు రావడంతో ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఫుల్ ఫోకస్ పెట్టి విచారణ చేపట్టింది. దీంతో బెదిరించిన వ్యక్తి ఆచూకీ పోలీసులకు చిక్కింది. వెంటనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
* విజయవాడలో నిందితుడు
పవన్ కళ్యాణ్ ని చంపుతానని బెదిరించిన వ్యక్తి విజయవాడకు చెందిన నూక మల్లికార్జున్ గా పోలీసులు గుర్తించారు. నాలుగు బృందాలు రంగంలోకి దిగగా విజయవాడ నగరంలోనే మల్లికార్జున్ పట్టుపడ్డాడు. దీంతో అతడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేపడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకీ సంబంధించి ఫోన్ నెంబర్లు ఎలా తెలిశా యి? ఫోన్ చేసి ఏమేం మాట్లాడారన్న దానిపై విచారణ చేపడుతున్నారు ఏపీ పోలీసులు. అయితే ఇంతవరకు ఆయన అరెస్టును అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ కేసుకు సంబంధించి వివరాలు బయటకు వెల్లడించలేదు.
* మానసిక స్థితి బాగా లేక
అయితే మల్లికార్జున్ గతంలో కూడా ఇటువంటి ఘటనలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. మద్యానికి అలవాటు పడిన మల్లికార్జున్ మానసిక స్థితి బాగుండదని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఇలా బెదిరింపు కాల్స్ చేసినట్లు నిర్ధారించారు. గతంలో ఇలా ఎవరెవరిని బెదిరించాడు అన్న దానిపైపోలీసులు విచారణ చేపడుతున్నారు. గతంలో విశాఖలో ఈయనపై కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. కేసు వివరాలను వెల్లడించనున్నారు పోలీసులు.