YCP: వైసీపీలో( YSR Congress) సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా ఆ పార్టీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునే స్థితిలో లేదు. ఒకవైపు పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్తున్నారు. ఇంకోవైపు ఉన్న వారిలో సైతం ఒక రకమైన సందిగ్ధత, ఆందోళన కనిపిస్తోంది. ఎప్పుడు ఏ నేత బాంబు పేల్చుతారో అన్న ఆందోళన ఉంది. ఇటువంటి సమయంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. అయితే జగన్ మాత్రం ఇంకా పూర్తిస్థాయి దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, షెడ్యూల్ ప్రకటన జారీ వంటి విషయాల్లో సీరియస్ నెస్ రాలేదు. ఇది అంతిమంగా పార్టీకి చేటు తెస్తుంది. ఇబ్బందికర పరిణామాలు తప్పవు. ముఖ్యంగా పార్టీలో సీరియస్ నెస్ పెంచాలి. లేకుంటే మాత్రం చాలా కష్టం. ఇప్పుడు వైసీపీకి కావాల్సింది ఆత్మస్థైర్యం. అంతకుమించి పార్టీలో ఒక రకమైన మంచి వాతావరణం. ఆపై పోరాటం చేసే తత్వం తీసుకురావాలి. లేకుంటే మాత్రం ఆ పార్టీ మరింత దిగజారడం ఖాయం.
* ఆ హామీలు అమలు కావడం లేదు
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. రెట్టింపు సంక్షేమం అని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి సంక్షేమ పథకాలు అమలు ప్రారంభమవుతాయని చెప్పారు. అవసరం అయితే సంపద సృష్టించి మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆర్భాటంగా చెప్పుకొచ్చారు. కానీ ఇంతవరకు సంక్షేమ పథకాల జాడలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప.. సంక్షేమ పథకాలు మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇటువంటి సమయంలో విపక్షంగా వైసిపి ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వైసిపి ఇందులో తడబాటుకు గురవుతోంది.
* వాయిదాల మీద వాయిదాలు
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్( fees reimbursement) చెల్లింపులు చేయాలని ఫీజు పోరు పేరుతో వైసిపి ఒక కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. కానీ ఈ కార్యక్రమం మూడుసార్లు వాయిదా పడింది. తొలుత జనవరిలో నిర్వహిస్తామని చెప్పారు. కానీ పండుగ దృష్ట్యా వాయిదా వేశారు. అటు తర్వాత జనవరి 29 అని చెప్పుకొచ్చారు. అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉండడంతో వాయిదా వేస్తారు. తరువాత ఫిబ్రవరి 5 అని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఉందని తెలిసినా ఆ రోజు ఫిక్స్ చేశారు. కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినా అటు నుంచి స్పందన లేకుండా పోయింది. దీంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కార్యక్రమాన్ని మార్చి 12 నాటికి వాయిదా వేశారు. తరచూ ఈ కార్యక్రమం వాయిదా పడుతుండడం వెనుక వైసీపీలో సమన్వయం లేదని అర్థమవుతోంది.
* జిల్లాల పర్యటన ప్రకటనకు 50 రోజులు
జగన్ ( Jagan Mohan Reddy)జిల్లాల పర్యటనకు సంబంధించి 50 రోజుల కిందట ప్రకటన చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వారానికి మూడు రోజులపాటు పర్యటిస్తానని.. ప్రతి నియోజకవర్గంలో చివరి స్థాయి నేత వరకు మాట్లాడతానని.. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటానని జగన్ ప్రకటించారు. అయితే నెలలు గడుస్తున్న ఈ జిల్లాల టూర్లకు సంబంధించి షెడ్యూల్ ఖరారు కాకపోవడం విమర్శలకు తావిస్తోంది. పార్టీలో కీలక నేతలు ఉన్నారు. కీలక విభాగాలు ఉన్నాయి. అధినేత పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేయలేని స్థితిలో పార్టీ ఉందా? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడానికి కూడా ఆ భయం ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముందుగా జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే సమన్వయం తీసుకు రావాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే మాత్రం కష్టమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.