YS Viveka case : వైఎస్ వివేకా హత్యకేసు కీలక మలుపులు తిరుగుతోంది. పాత్రధారులను సీబీఐ బయటకు తీసింది. సూత్రధారుల పాత్ర వద్దకు వచ్చేసరికి దర్యాప్తు ఆగింది. కానీ ఇంటర్నల్ గా మాత్రం సీబీఐ సంకేతాలిచ్చేసింది. సొంత కుటుంబ సభ్యుల వాంగ్మూలాలతో తేటతెల్లం చేసింది. ఇక తేల్చాల్సింది వ్యవస్థలే. అసలు సూత్రధారులను బయటకు తీసి, అభియోగాలు మోపి న్యాయస్థానం ముందుంచితే సీబీఐ ప్రభ ఈ దేశంలో వెలిగిపోతుంది. అత్యున్నత దర్యాప్తు సంస్థపై ప్రతీ పౌరుడికి గౌరవం పెరుగుతుంది. లేకుంటే మాత్రం బలవంతుడు ఎంతటి నేరన్నైనా తప్పించుకోవచ్చన్న కచ్చితమైన అభిప్రాయానికి ప్రజలు వచ్చే అవకాశముంది. అది దేశ నేర పరిశోధన, న్యాయ వ్యవస్థల పనితీరుకు మాయని మచ్చగా నిలుస్తుంది.
కేసులో నిందితుల్లో ఒకరైన దస్తగిరి వాంగ్మూలాన్ని విట్ నెస్ గా ఎలా తీసుకుంటారని ఇన్నాళ్లూ ప్రశ్నించిన వారికి తాజా చార్జిషీట్ తో సీబీఐ షాకిచ్చింది. సాంకేతిక ఆధారాలతో సంచలనాత్మకమైన అంశాలను అందులో పొందుపరిచింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 147 పేజీలతో కూడిన చార్జిషీట్ దర్యాప్తులో అసలు అంకాన్ని పూర్తిచేసింది. అయితే క్లైమాక్స్ కు ఐదు నిమిషాల ముందు అన్నట్టు అసలు సూత్రధారుల ఎంట్రీ ముందు నిలిచిపోయింది. అయితే ఈ రోజు కాకున్నా రేపైనా సూత్రధారులు బోనులో నిలవడం పక్కా అని మాత్రం న్యాయ నిపుణులు చెబుతున్నారు.
2019 మార్చి 14న అర్ధరాత్రి దాటిన తరువాత వివేకా హత్య జరిగింది. కానీ ఉదయం 6.30 గంటలకు వివేకా మృతిచెందినట్టు పీఏ కృష్ణారెడ్డి గుర్తించారు. కానీ అంతకు ముందే హత్యచేసిన వారు తెలిసిన మనుషులతో పంచుకున్నారు. జగన్ కు ఐదు గంటలకే తెలుసునని ఆయన ఇంట్లో మీటింగ్ కు హాజరైన అజయ్ కల్లాం సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి సైతం అదే విషయాన్ని చెప్పారు. సరిగ్గా ఇక్కడకు వచ్చేటప్పటికీ సీబీఐ దర్యాప్తు ఆగింది. అయితే దాని వెనుక ఉన్న పర్యవసానాలపై ఇప్పటికే అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ పూర్తిచేసి ఉంటుంది. కానీ బయటపెట్టడం లేదు.
అయితే కేసు విషయంలో సీఎం జగన్ సోదరి షర్మిళ ఇచ్చిన వాంగ్మూలం సూటిగా, సుత్తి లేకుండా ఉంది. అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు దక్కకుండా వివేకా పావులు కదిపారు. షర్మిళను కలిసి ఎంపీగా పోటీచేయాలని కోరారు. అన్నివిధాలా ఒత్తిడిచేసి ఒప్పించారు. కానీ సీఎం జగన్ సీటు ఇవ్వనని చెప్పారు. కుటుంబంలో జరిగిన ప్రతి ఎపిసోడ్ చెప్పుకొచ్చారు. దీంతో దాదాపు కేసు ఒక ఎండ్ పాయింట్ కు వచ్చినట్టే.కీ పాయింట్ కు వచ్చి ఆగినట్టే. అయితే ఎక్కడ ఆగిందో.. అక్కడ నుంచే స్టార్ట్ చేసి సీబీఐ ఎండ్ చెబుతుందో.. లేకుంటే అసలు ఎండింగ్ చేయకుండా సశేషంగా మిగుల్చుతుందో చూడాలి మరి.