TDP MLA’s : ఏపీ రాజకీయాలలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తన స్థిరాస్తి వ్యాపారం కోసం పొలం అమ్మలేదని కమ్మ వెంకటరావు అనే వ్యక్తిని రామచంద్ర రావు వేధించాడు. చివరికి అట్రాసిటీ కేసు కూడా పెట్టించాడు.. పిడుగురాళ్ల కు చెందిన కమ్మ వెంకటరావు అనే వ్యక్తికి కొంత భూమి ఉంది. అయితే ఆ భూమిలో నాలుగు ఎకరాలను రామచంద్రరావు గతంలో కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.. ఎకరానికి 48 లక్షలు చెల్లిస్తానని మాట కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, రామచంద్ర రావు భార్య ఎమ్మెల్యే కావడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. దీంతో రామచంద్రరావు గతంలో వెంకట్రావుతో కుదుర్చుకున్న ఒప్పందానికి తిలోదకాలు ఇచ్చాడు. 30 లక్షల కే 4 ఎకరాలు అమ్మాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. లేకుంటే పోలీసుల చేత ఇబ్బంది పెట్టిస్తానని హెచ్చరించాడు. అయినప్పటికీ వెంకట్రావు తలవంచకపోవడంతో.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడు. దీంతో వెంకట్రావు విలేకరులతో తన గోడును వెల్లబోసుకున్నాడు..
ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన ఘటన..
వెంకట్రావుకు జరుగుతున్న అన్యాయాన్ని అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రసారం చేయడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.. ముఖ్యంగా పోలీసులు ఎమ్మెల్యే భర్తకు వత్తాసు పలకడంతో వెంకట్రావు ఆవేదన అరణ్య రోదనగా మారింది. మరోవైపు ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించడంతో ఎమ్మెల్యే భర్త అసలు రూపం బయటి ప్రపంచానికి తెలిసింది. ఇది కూటమి ప్రభుత్వానికి డ్యామేజీ కలిగించే ప్రమాదం ఉండడంతో.. వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని ఆరా తీస్తున్నట్టు సమాచారం. బాధితుడికి న్యాయం చేసేలాగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు మాధవి, రామచంద్రరావుకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.. అయితే ఈ విషయాన్ని అటు వైసిపి, ఇటు టిడిపి మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించడం విశేషం.
టిడిపి నేతలు ఎలాంటి వివరణ ఇస్తారో?
వాస్తవానికి ఈ ఘటన కేవలం వైసీపీ అనుకూల మీడియాలోనే ప్రచురితమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ టిడిపిలోని ప్రధాన మీడియా గా పేరుపొందిన ఆంధ్రజ్యోతి కూడా ఈ వార్తకు సముచిత ప్రాధాన్యం ఇచ్చింది. ఏకంగా ఏపీ ఎడిషన్ లో బ్యానర్ వార్తగా ప్రచురించింది. ఇది సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. మరి దీనిపై టిడిపి నేతలు ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఈ కథనం ఏపీలో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. దీనిని వైసీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగం తెగ వ్యాప్తిలోకి తీసుకురావడం ఇక్కడ విశేషం.