Naga Chaitanya: హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలను గుర్తించి హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వం కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మాధాపూర్ లో ఉండే అక్కినేని నాగార్జున N కన్వెన్షన్ మాల్ ని ఇటీవలే కూల్చేసిన ఘటన యావత్తు సినీ లోకాన్ని విస్మయానికి గురయ్యేలా చేసింది. నాగార్జున కూడా ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ, అది పట్టా భూమి, ఒక్క అంగుళం కూడా అక్రమంగా కట్టలేదని, హై కోర్టు అప్పట్లోనే కూల్చొద్దు అంటూ స్టే ఆర్డర్ ఇచ్చిందని, ప్రభుత్వం ఆ ఆర్డర్ ని లెక్క చెయ్యకుండా కూల్చేసిందని, దీనిపై నేను హై కోర్ట్ లో న్యాయపోరాటం చేస్తాను అంటూ నాగార్జున చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం కూడా స్పందిస్తూ, నాగార్జున చెప్తున్నవి పూర్తిగా అబద్ధాలని, హై కోర్టు ఎలాంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదు అంటూ ప్రకటించింది.
ఇదంతా పక్కన పెడితే, రీసెంట్ గానే అక్కినేని నాగచైతన్య ఈ ఘటనపై స్పందించారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఒక వస్త్ర దుకాణం ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మీడియా తో కాసేపు ముచ్చటించారు. ఒక విలేఖరి N కన్వెన్షన్ కూల్చివేత పై నాగ చైతన్య ని అడగగా , దానికి ఆయన సమాధానం చెప్తూ ‘నాన్న గారు దీని గురించి క్లారిటీ ఇస్తూ ట్విట్టర్ లో స్పందించారు. ఇప్పుడు నేను దాని గురించి ఇక్కడ మాట్లాడాలనుకోవడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే మీ పెళ్లి ఎప్పుడు జరగబోతుంది అని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ‘డెస్టినేషన్ వెడ్డింగా, లేదా హైదరాబాద్ లోనే పెళ్లి చేసుకుంటానా అనేది ఇంకా ఖరారు కాలేదు. పెళ్లి ఎప్పుడు అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే చర్చించుకొని మీకు పూర్తి వివరాలు చెప్తాము’ అంటూ సమాధానం ఇచ్చాడు నాగ చైతన్య.
ఇది ఇలా ఉండగా ఎప్పుడూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉందని మీరు, ఈమధ్య బాగా కనిపిస్తున్నారు అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు నాగ చైతన్య సమాధానం చెప్తూ ‘అలా ఏమి లేదే..ఎప్పటి లాగానే ఉన్నాను. బహుశా సోషల్ మీడియా లో నా గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారేమో’ అని సమాధానం ఇచ్చాడ్డు. తండేల్ గురించి కొన్ని విశేషాలు చెప్పండి అంటూ ఒక విలేఖరి అడగగా , దానికి ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లుక్ తండేల్ కోసమే. నా కెరీర్ లో ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఔట్పుట్ చాలా బాగా వస్తుంది. ఇందులో నేను అత్యంత ఛాలెంజింగ్ రోల్ ని చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో విడుదల అవ్వగా, దానికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.