AP BJP
AP BJP: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీని కూటమి టార్గెట్ చేసుకుంది. ఎలాగైనా నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నంలో ఉంది. అందుకు తగ్గట్టు వ్యూహాలు అమలు చేస్తోంది. అయితే పార్టీలు ఎవరికి వారుగా ఎదుగుతూనే కూటమి మధ్య సఖ్యత ఉండేలా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి చేరికల విషయంలో బిజెపి సరికొత్త నిబంధనలు తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఇప్పుడు కూటమిలో ఇదే ఆసక్తికరంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో బిజెపి ప్రాతినిధ్యం పెరిగింది. అందుకే ఇక్కడ బలపడాలని.. ఇదే సరైన సమయమని బిజెపి భావిస్తోంది. ఈ క్రమంలోనే బిజెపి హై కమాండ్ రాష్ట్ర నాయకత్వానికి నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు చేరికల విషయంలో మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండాలన్నది షరతు. కానీ ఇకనుంచి చేరికల విషయంలో.. ఎవరైనా ముందుకు వస్తే పార్టీలో చేర్చుకోవాలని బిజెపి నిర్ణయించడం విశేషం.
* బిజెపి కొత్త మెలిక
అయితే ఈ చేరికల విషయంలో భారతీయ జనతా పార్టీ ( BJP)సరికొత్త మెలిక పెట్టింది. ముఖ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు బిజెపి ద్వారా మంతనాలు సాగించి రాజీనామా చేస్తే.. వారి స్థానంలో బిజెపికి అవకాశం ఇవ్వాలన్నది కొత్త డిమాండ్. ఏపీలో వైసీపీ నిర్వీర్యం కావడం ఒక కారణం అయితే.. అలా ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో బిజెపి బాగా వేయాలన్నది ప్లాన్. తద్వారా రాజ్యసభలో బిజెపి ప్రాతినిధ్యం పెంచుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ సమయంలో బిజెపి ఒక రాజ్యసభ పదవి కోసం పట్టు పట్టింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన పదవి కూడా తానే కోరుకుంటుంది బిజెపి. దీంతో మిగతా రెండు కూటమి పార్టీల్లో ఒక రకమైన అసహనం వ్యక్తం అవుతోంది.
* తెరపైకి నయా ఫార్ములా
అయితే వైసీపీ( YSR Congress ) నుంచి చేరికల విషయంలో బిజెపి ఒక ఫార్ములాను తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే మీరు తీసుకోవచ్చని సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన పదవిని తమకు విడిచి పెట్టాలన్నది బిజెపి డిమాండ్ గా తెలుస్తోంది. ఒక్క విజయసాయిరెడ్డి కాదు. తమతో టచ్ లో ఉన్న నేతలు రాజీనామా చేస్తే ఆ స్థానాలు తమ పార్టీకి దక్కుతాయని బిజెపి పెద్దలు సైతం ఆ రెండు పార్టీలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ రెండు పార్టీలు రాజ్యసభ పదవులపై ఆశలు వదులుకున్నట్లు అవుతోంది.
* ఆ ముగ్గురు బిజెపిలోకి..
వైసిపి( YSR Congress ) నుంచి మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులు బయటకు వస్తారని ప్రచారం నడుస్తోంది. వాళ్లు తమ పదవులకు రాజీనామా చేస్తారని కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఆ ముగ్గురిని బిజెపిలో చేర్చుకోవాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. వారిని నేరుగా చేర్చుకొని బిజెపి ఎంపీలుగా మార్చుకోవాలని.. లేకుంటే అదే నేతలతో రాజీనామా చేసి.. మరోసారి రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసుకోవాలని చూస్తోంది. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు చెప్పవద్దని ముందస్తుగానే టిడిపి తో పాటు జనసేనకు కేంద్ర పెద్దలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేవలం వైసీపీ దెబ్బ తీశామన్న సంతృప్తి టిడిపి తో పాటు జనసేనకు మిగులుతుంది. రాజ్యసభ సంఖ్యాబలం మాత్రం పెంచుకుంటుంది.