Railway Gates
Railway Gates: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి భారీగా సాయం అందుతోంది. దేశంలోనే ప్రత్యేకంగా ఏపీని పరిగణలోకి తీసుకుంటోంది కేంద్రం. అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అండగా నిలుస్తోంది. ఇంకోవైపు రాష్ట్రానికి రవాణాతోపాటు రైల్వే ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాలతో పాటు చిన్న చిన్న గ్రామాలకు సైతం దశాబ్దాలుగా రైల్వే గేట్లు, లెవెల్ క్రాసింగ్ సమస్య ఉంది. వీటివల్ల రైల్వేకు ఎన్నో ఏళ్లుగా అదనపు భారం పడుతోంది. సిబ్బంది కేటాయింపు తో పాటు వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. అందుకే ఇటువంటి రైల్వే గేట్లు ఉన్న చోట వంతెనలు నిర్మించాలని నిర్ణయించింది రైల్వే శాఖ. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు కూడా చేస్తోంది.
* రైల్వేకు అదనపు భారము
సాధారణంగా రైల్వే ట్రాక్ ( railway track)ఉన్నచోట పక్కనే చాలా వరకు గ్రామాలు ఉంటాయి. రహదారులు ఉంటాయి. పొలాల్లోకి వెళ్లేందుకు మార్గాలు ఉంటాయి. అటువంటి చోట్ల రైల్వే శాఖ ఇన్ని రోజులు తాత్కాలిక గేట్లను ఏర్పాటు చేస్తూ వచ్చింది. అక్కడ మూడు షిఫ్ట్ లో పనిచేసే సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉంటారు. దీంతో వారి జీతాలతో పాటు గేట్ల నిర్వహణ రైల్వే శాఖకు అదనపు భారం అవుతోంది. అందుకే రైల్వే గేట్లు ఉన్నచోట ప్రత్యామ్నాయంగా వంతెనలు నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైల్వే గేట్లపై సర్వే నిర్వహించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 390 రైల్వే గేట్లు ఉన్నట్లు తేలింది.
* ఇప్పటికే కొన్ని చోట్ల ఏర్పాటు
ఇప్పటికే అత్యవసరం ఉన్నచోట రైల్వే గేట్లకు( Railway Gates) ప్రత్యామ్నాయంగా వంతెనలు నిర్మించింది. వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు తరలించడంతో పాటు రైతుల రాకపోకలకు సంబంధించి అత్యవసర బ్రిడ్జిలను కూడా ఏర్పాటు చేసింది రైల్వే. అయితే కొన్ని చోట్ల వాటి నిర్మాణం సాధ్యం కాలేదు. అటువంటి చోట్ల గేట్లు స్థానంలో ప్రత్యామ్నాయంగా వంతెనలు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా రైల్వేకు అదనపు భారం తగ్గడంతో పాటు ప్రజా రవాణాకు, వస్తు రవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్.
* ఆ ఇబ్బందులు లేకుండా చూడాలని
అయితే ఇప్పటికే ప్రధాన నగరాలు, పట్టణాల్లో రైల్వే గేట్ల వద్ద వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా గేట్లు కొనసాగుతున్నాయి. ఒక్కోసారి గేట్లు మొరాయించిన.. రైళ్ల రాకపోకలు ఆలస్యంగా జరిగినా ట్రాఫిక్ నకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు ఉన్నాయి. గేట్లు స్థానంలో వంతెనలు నిర్మించాలని విన్నపాలు వచ్చాయి. అందుకే కేంద్ర రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2027 నాటికి గేట్లు అన్నవే లేకుండా చూడాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రతి చోట రైల్వే వంతెనలు నిర్మించాలని ప్రతిపాదించింది. అందుకు సంబంధించి కార్యాచరణ సైతం పూర్తి చేస్తోంది. అందుకు ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించడం విశేషం.