AP Assembly Session: 22 నుంచి అసెంబ్లీ.. ఈసారి బడ్జెట్ లేనట్టే.. ప్రత్యేకంగా ఆర్డినెన్స్!

ఏపీ ప్రభుత్వం కొత్త పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇది ఒక కొలిక్కి తీసుకొచ్చిన తరువాతే బడ్జెట్ పై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. అందుకే మూడు నెలలకు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థికంగా వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చిన తర్వాత.. సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Written By: Dharma, Updated On : July 9, 2024 5:01 pm

AP Assembly Session

Follow us on

AP Assembly Session: అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 22 నుంచి సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఐదు రోజులు పాటు సభను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగం పై చర్చ, ధన్యవాదాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సమీక్షించి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సమయం లేకపోవడంతో.. మూడు నెలలకు సంబంధించి తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం నాలుగు నెలలకు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈనెల 31 తో ముగియనుంది.

ఏపీ ప్రభుత్వం కొత్త పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇది ఒక కొలిక్కి తీసుకొచ్చిన తరువాతే బడ్జెట్ పై స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. అందుకే మూడు నెలలకు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థికంగా వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చిన తర్వాత.. సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఆర్డినెన్స్ కు సంబంధించిన ప్రతిపాదనపై సీఎం ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురుచూస్తోంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులు పాటు నిర్వహించారు. తొలి రోజు ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించారు. ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. రెండో రోజు అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఎన్నుకున్నారు. అటు తరువాత సభ వాయిదా పడింది. అయితే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు శ్వేత పత్రాలను విడుదల చేశారు. ఈరోజు విద్యుత్ విధానాలపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. కాగా ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి. ఆర్థికపరమైన అంశాలన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత.. బడ్జెట్ పై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.