https://oktelugu.com/

Toll fees : ఏపీలో ఆటోలు, ద్విచక్ర వాహనాల నుంచి టోల్ వసూలు.. ఫుల్ క్లారిటీ.. ఆందోళనలో ప్రజలు

ఏపీలో రహదారులు బాగాలేవు. గత వైసిపి ప్రభుత్వం రోడ్లపై పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో అవి దారుణంగా తయారయ్యాయి. వాటికి మరమ్మత్తులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి నిధుల సమీకరణ కష్టంగా మారింది. ఈ తరుణంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : August 1, 2024 4:14 pm
    Follow us on

    Toll fees: ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిందా? ప్రజల నుంచి పెద్ద ఎత్తున పన్నులను వసూలు చేయాలని భావిస్తుందా?ముఖ్యంగా రహదారుల నిర్మాణానికి టోల్ వసూలు చేయనుందా?ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను బాగు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుందా?సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఇదే రచ్చ నడుస్తోంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.అయితే ప్రభుత్వం వద్ద ఆశించిన స్థాయిలో నిధులు లేకపోవడంతో..పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ద్విచక్ర వాహనాలు, ఆటోలకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది. ఆ పార్టీ శ్రేణులు రోల్ కూడా చేస్తున్నాయి. దీంతో సామాన్యుల్లో సైతం ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టిడిపి అలెర్ట్ అయ్యింది. ఫ్యాక్ట్ చెక్ టీం స్పందించింది. ఇది తప్పుడు వార్తగా నిర్ధారించింది. ఫేక్ జగన్.. నీ పేటీఎం బ్యాచ్ నిన్ను బాగా ఫాలో అవుతోంది అంటూ అధికార టిడిపి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదని.. అబద్ధపు ప్రచారాలను ఖండిస్తోందని చెప్పుకొచ్చింది. ఆటోలు, ద్విచక్ర వాహనాలకు రాష్ట్రంలో ఎలాంటి టోల్ ఫీజు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

    * వైసిపి పై అసంతృప్తి
    గత ఐదేళ్ల వైసిపి పాలనలో రహదారులు గోతులు మయంగా మారడం, మరమ్మత్తులు చేయకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వంపై అసంతృప్తి రేగింది. సంక్షేమానికి పెద్ద ఎత్తున ఖర్చు చేసి.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వెనుకబాటుపై అంతట ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఈ తరుణంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణం పై దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో రహదారుల నిర్మాణానికి కసరత్తు ప్రారంభమైంది. అందుకే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలను మినహాయించి.. మిగిలిన వాహనాలకు టోల్ వసూలు చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

    * రోడ్ల నిర్వహణకు తప్పనిసరి
    ఇప్పటివరకు జాతీయ రహదారులు, అంతర్రాష్ట్ర రహదారులపై టోల్ ప్లాజా లు ఏర్పాటు చేశారు. రోడ్ల నిర్మాణానికి వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల ద్వారా మంజూరైన రుణాల రికవరీ గాను.. పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో టోల్ వసూలు చేసేవారు. వాహనాల సామర్థ్యం బట్టి ఈ వసూలు ప్రక్రియ నడిచేది. ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల మంచి టోల్ ఫీజు వసూలు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు రహదారుల అభివృద్ధికి అన్ని వాహనాల నుంచి పన్నులు వసూలు చేస్తారని ప్రచారం జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

    ప్రభుత్వం నుంచి స్పష్టత ఏది?
    అయితే కేవలం టిడిపి అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి మాత్రమే ఈ ప్రకటన వచ్చింది. టోల్ వసూలు అనే ఆలోచన లేదని సంబంధిత ఫాక్ట్ చెక్ టీమ్ మాత్రమే ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ప్రకటన మాత్రం రాలేదు. ఈ విషయంలో స్పష్టత రాకపోవడంతోప్రజలు ఆందోళన చెందుతున్నారు.