Chittor District : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మహిళా సీఐ అంజూయాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ జనసేన నాయకుడి చెంప చెల్లుమనిపించారు. గతంలో కూడా అంజూ యాదవ్ వ్యవహార శైలి వివాదాస్పదమైంది. తాజాగా సీఎం జగన్ దిష్టిబొమ్మను జనసేన నేతలు దహనం చేసే ప్రయత్నం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. దీంతో కోపోద్రిక్తురాలైన సీఐ అంజూయాదవ్ జన సైనికులపై విరుచుకుపడ్డారు. ఓ జనసేన నాయకుడిపై చేయిచేసుకున్నారు. సదరు నాయకుడ్ని కానిస్టేబుల్ పట్టుకోగా.. రెండు చెంపలపై సీఐ గట్టిగా కొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటనతో శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ నాయకుడిపై సీఐ చేయిచేసుకున్నారని సమాచారమందుకున్న జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కొంతమంది జనసేన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై జనసేన నాయకులు దుమ్మెత్తిపోశారు. వైసీపీ సర్కారు అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపించారు.
అయితే సీఐ అంజూయాదవ్ వైఖరి గతంలో సైతం వివాదాస్పదమైన సందర్భాలున్నాయి. హోటల్ సమయానికి మూయలేదంటూ ఓ మహిళా వ్యాపారిపై చేయిచేసుకున్నారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. తక్షణం మహిళా సీఐపై కేసు నమోదుచేయాలని డీజీపీకి లేఖ రాసింది. టీడీపీ నిరసన కార్యక్రమంలో ఓ నేత చెంపను చెల్లుమనిపించారు. టీడీపీ మహిళా నేతను ఏకంగా ఈడ్చుకుంటూ వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. తాజా ఘటనతో సీఐ తీరుపై అన్ని రాజకీయ పక్షాలు గుర్రుగా ఉన్నాయి.