Chandrababu : చంద్రబాబు చేతిలో ధర్మాన భవితవ్యం

అదే శంకరును కొనసాగించి గుండ కుటుంబం మద్దతు ఇవ్వకపోతే మాత్రం.. ప్రసాద్ రావు సేఫ్ జోన్ లో నిలబడతారు. మరి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చూడాలి. మొత్తానికైతే చంద్రబాబు చేతిలోనే ఇప్పుడు ధర్మాన భవితవ్యం ఉంది. మరి టిడిపి అధినేత నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Written By: NARESH, Updated On : April 12, 2024 8:36 pm

Dharmana-Prasada-Rao

Follow us on

Chandrababu : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ సీనియర్ మంత్రిని ఓ యువ సర్పంచ్ ఢీకొడుతుండడమే అందుకు కారణం. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఒకవైపు.. కేవలం సర్పంచ్ గా పదవి చేపట్టిన ఓ యువకుడు మరోవైపు నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొత్తం ఎనిమిది సార్లు పోటీ చేసిన ఆయనకు.. రెండుసార్లు ఓటమి తప్పలేదు. ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానని నమ్మకంగా ఉన్నారు. ఆయనపై టిడిపి అభ్యర్థిగా యువ నాయకుడు గొండు శంకర్ పోటీ చేస్తున్నారు.

శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ కుటుంబానిది ప్రత్యేక స్థానం. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సుదీర్ఘకాలం శ్రీకాకుళం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో ఆయన భార్య లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే దశాబ్దాల అనుభవమున్న ఆ కుటుంబాన్ని పక్కనపెట్టి చంద్రబాబు శంకర్ కు టికెట్ ఇవ్వడం సాహసమే. శంకర్ ఒక పర్యాయం టిడిపి సర్పంచ్ గా పనిచేశారు. ఆయన తండ్రి ఎంపీపీగా సేవలందించారు. కానీ గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. అటువంటి యువ నాయకుడికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అయితే అక్కడ గుండ కుటుంబానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వారు సహకరిస్తేనే శంకర్ ధర్మాన ప్రసాదరావుకు గట్టి పోటీ ఇచ్చేది. లేకుంటే మాత్రం కష్టం.

గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో ధర్మాన ప్రసాదరావు బయటపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు పదివేలకు పైగా మెజారిటీ సాధించారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మాత్రం 5 వేలకు పైగా ఓట్లతో బయటపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం కావడం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికంగా ఉండడం, వ్యాపార వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం.. తదితర కారణాలతో ఓటమి తప్పదని స్వయంగా ధర్మాన ప్రసాద రావే ఒక అంచనాకు వచ్చారు. ఇటువంటి సమయంలో గుండ కుటుంబం విజయం ఖాయమని అంతా భావించారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా గోండు శంకర్ కు టికెట్ ఇచ్చారు. దీంతో గుండ కుటుంబం వైఖరి ఏమిటన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ టికెట్ మార్చుతారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ శంకర్ ను తప్పించి గుండ కుటుంబానికి టికెట్ ఇచ్చినా.. శంకర్ కు గుండ కుటుంబం మద్దతు ఇచ్చినా ధర్మాన ప్రసాదరావుకు గండం తప్పదు. అదే శంకరును కొనసాగించి గుండ కుటుంబం మద్దతు ఇవ్వకపోతే మాత్రం.. ప్రసాద్ రావు సేఫ్ జోన్ లో నిలబడతారు. మరి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చూడాలి. మొత్తానికైతే చంద్రబాబు చేతిలోనే ఇప్పుడు ధర్మాన భవితవ్యం ఉంది. మరి టిడిపి అధినేత నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.