Chandrababu – Pawan Kalyan : జగన్ కు జై కొడుతున్న చంద్రబాబు, పవన్

అందుకే నేతలు పోటా పోటీగా సంక్షేమాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. అయితే ఈ పోటాపోటీ సంక్షేమ పథకాల ప్రకటనతో.. అంతిమంగా ప్రజలకే ఇబ్బంది కలుగుతుందని.. ఈ రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని.. ఎవరూ గుర్తించకపోవడం విచారకరం.

Written By: NARESH, Updated On : April 12, 2024 8:07 pm

how-pawan-kalyan-is-different-fr

Follow us on

Chandrababu – Pawan Kalyan : ఏపీలో ఎన్నికల ప్రచారాలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. అన్ని పార్టీలు సంక్షేమం అమలు చేస్తామని చెబుతున్నాయి. ఇప్పటివరకు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలను విమర్శించిన చంద్రబాబు, పవన్ లు సైతం యూటర్న్ తీసుకోక తప్పలేదు. ఇన్నాళ్లు అభివృద్ధిని చంద్రబాబు నమ్ముకున్నారు. కానీ అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల విషయంలో హామీలు ఇస్తే గానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని గుర్తించారు. అందుకే తాము అధికారంలోకి వస్తే జగన్ కు మించిన పథకాలు అందిస్తామని చెబుతున్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు కీలక అంశాల్లో చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న హామీలు చూస్తుంటే ఆయన యూటర్న్ తీసుకున్నట్లు తెలిసిపోతోంది. అటు పవన్ కళ్యాణ్ సైతం సంక్షేమ పథకాల విషయంలో కీలక ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఆ ఇద్దరు నేతల తీరుపై వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో వేసుకుంటోంది.

జగన్ గత ఐదేళ్లుగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. దీంతో అభివృద్ధి లేదన్న అపవాదు ఉంది. అటు విపక్షాలు సైతం జగన్ ను టార్గెట్ చేసుకున్నాయి. ఉచిత పథకాల మాటున ఏపీని శ్రీలంక మాదిరిగా మార్చారని.. 20 ఏళ్ల పాటు ఏపీ వెనక్కి వెళ్లిపోయిందని.. దీనంతటికీ నగదు పంచుడే కారణమని చంద్రబాబుతో పాటు పవన్ ఆరోపించారు. అయితే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసి.. జగన్ ప్రజలకు దగ్గరయ్యారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ మరోసారి అధికారంలోకి రావాలని వైసిపి ప్రచారం ప్రారంభించింది. అభివృద్ధి లేదని గుర్తించిన వారు తప్పకుండా జగన్ ను వ్యతిరేకిస్తారు. ఆ ఓటు బ్యాంకు తమ వద్ద ఎలానూ ఉంటుంది. అందుకే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. జగన్కు మించి సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. పెన్షన్ విషయంలో కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతామని.. బీసీలైతే 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని.. అది కూడా ఏప్రిల్, మే,జూన్ పింఛన్లతో కలిపి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అటు వలంటీర్లను సైతం కొనసాగిస్తామని.. వారి వేతనం 5000 నుంచి పదివేల రూపాయలకు పెంచుతామని కూడా చెప్పుకొచ్చారు.

అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు పవన్ వైఖరి పై బలంగా చర్చ నడుస్తోంది. సంక్షేమ పథకాల విషయంలో పోటీ ప్రకటనలు చూస్తుంటే.. జగన్ వైఖరి పై వారు భయపడుతున్నట్టే. సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి జగన్ బలంగా వెళ్లారని వారు ఒప్పుకున్నట్టే. వాస్తవానికి చంద్రబాబు అభివృద్ధి అనే విషయంలో ముందంజలో ఉండేవారు. సంక్షేమ పథకాల విషయంలో వెనుకడుగు వేసేవారు. అయితే ఇప్పటివరకు తనకున్న మంచి పేరును పక్కనపెట్టి.. సంక్షేమ పథకాలను నమ్ముకోవాలని చంద్రబాబు భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటు పవన్ సైతం మెరుగైన సంక్షేమం అందిస్తామని చెబుతుండడం మారిన వైఖరిని తెలియజేస్తోంది. ఇన్నాళ్లు ఉచిత పథకాలతో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోతోందని.. అభివృద్ధి లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేసిన నేతలే.. ఇప్పుడు అదే బాట పడుతుండడం మాత్రం గమనార్హం. గెలుపొందాలంటే ప్రజలకు సంక్షేమం ఇస్తామని చెప్పాల్సిందే. కేవలం అభివృద్ధి అనే నినాదాన్ని ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. అందుకే నేతలు పోటా పోటీగా సంక్షేమాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. అయితే ఈ పోటాపోటీ సంక్షేమ పథకాల ప్రకటనతో.. అంతిమంగా ప్రజలకే ఇబ్బంది కలుగుతుందని.. ఈ రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని.. ఎవరూ గుర్తించకపోవడం విచారకరం.