CPI And CPM: ఏపీలో ఎర్రజెండా పార్టీలు ఇక చరిత్రే!

2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తులతో చట్టసభల్లో అడుగు పెట్టాలని సీపీఐ భావిస్తోంది. ఈమేరకు జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టీడీపీతో పొత్తు కోసం రెండు మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : జనవరి 6, 2024 1:19 సా.

CPI And CPM

Follow us on

CPI And CPM: తెలుగు రాష్ట్రాల్లో ఎర్ర జెండా పార్టీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు పదేళ్లు ఇటు తెలంగాణ అటు ఏపీలో చట్ట సభల్లో సీపీఐ, సీపీఎంలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతున్నాయి. కేసీఆర్‌ అన్నట్లు తోక పార్టీలుగా మారిపోయాయి. పాత సిద్ధాంతాలను పట్టుకుని వేళాడుతున్న కమ్యూనిస్టులు.. మార్పుకు అనుగుణంగా అప్‌డేట్‌ కావడం లేదు. ఈ క్రమంలో రెండు పార్టీలు జాతీయ హోదా కోల్పోయాయి. దీంతో ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సీపీఐ తనస్థాయిని దిగజార్చుకుని మరీ.. ఒక్క ఎమ్మెల్యే స్థానంతో సరిపెట్టుకుంది. మరో ఎంపీ స్థానం కోసం కూడా ప్రయత్నిస్తోంది. ఇక సీపీఎం పంథానికి పోయి.. పోటీచేసిన అన్ని చోట్ల డిపాజిట్‌ కోల్పోయి పరువు పోగొట్టుకుంది.

ఏపీలో మరింత దిగజారి..
ఇక 2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తులతో చట్టసభల్లో అడుగు పెట్టాలని సీపీఐ భావిస్తోంది. ఈమేరకు జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టీడీపీతో పొత్తు కోసం రెండు మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, పట్టు వీడని విక్రమార్కుడిలా నారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరుపుతూనే వచ్చారు. ఇండియా కూటమిలో చేరాలని కోరారు. కానీ, తాము బీజేపీతోనే వెళ్తామని చంద్రబాబు చెబుతూ వచ్చారు. అయినా నారాయణ, రామకృష్ణ తమ స్థాయిని దిగజార్చుకుని టీడీపీ వెంట పడుతూనే వచ్చారు.

చివరికి షాక్‌..
ఎంత ప్రయత్నించినా టీడీపీ తన నిర్ణయం మార్చుకోలేదు. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారు. సీపీఐ నారాయణ మాత్రం జనసేన, టీడీపీ, సీపీఐ కలిసి పోటీచేస్తే అధికారంలోకి వస్తామని చెబుతూ వచ్చారు. వాస్తవానికి తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కమ్యూనిస్టులకు పట్టు చాలా తక్కువ. బీజేపీకి కూడా పెద్దగా స్కోప్‌ లేదు. అయినా.. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండడంతో చంద్రబాబు బీజేపీతో వెళ్లడమే మేలని భావిస్తున్నారు. దీంతో కమ్యూనిస్టులతో దోస్తీ కటీఫ్‌ చేసుకున్నారు. ఇండియా కూటమిలో చేరేది లేదని స్పష్టం చేశారు.

ఒంటరైన సీపీఐ..
చాలాకాలంగా టీడీపీతో దోస్తీకి సీపీఐ నారాయణ, రామకృష్ణ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయాన్ని నారాయణే స్వయంగా వెల్లడించారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిపి పనిచేయాలని నిర్ణయించుకుందని ప్రకటించారు. దీంతో ఇక సీపీఐకి మిగిలింది అధికార వైసీపీ. కానీ, జగన్‌ కమ్యూనిస్టులను ఎన్నడూ దగ్గర తీయలేదు. పొత్తుల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు. దీంతో ఏపీలో వచ్చే ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి.