https://oktelugu.com/

YCP: అందరి దారి లండన్ వైపే.. ఏం జరుగుతోంది?

పోలింగ్ ముగిసిన తరువాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అమెరికా వెళ్లిపోయారు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన ఆరు నెలల వరకు రారని సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : May 28, 2024 / 12:12 PM IST

    YCP

    Follow us on

    YCP: ఏపీ రాజకీయాలకు ఇప్పుడు విదేశాలు కేంద్రంగా మారుతున్నాయి. పోలింగ్ అనంతరం ఎక్కువ మంది నేతలు విదేశాలకు వెళ్లారు. గత మూడు నెలలుగా ఎన్నికల నిర్వహణలో క్షణం తీరిక లేకుండా గడిపిన నాయకులంతా కుటుంబాలతో సేద తీరుతున్నారు. అయితే వైసీపీ నేతలు అంతా లండన్ వెళుతుండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక రకరకాల చర్చ నడుస్తోంది. ఏపీ సీఎం జగన్ లండన్ లో ఉండడమే అందుకు కారణం. ఆయన వెళ్లిన తర్వాత చాలామంది నేతలు లండన్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

    పోలింగ్ ముగిసిన తరువాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అమెరికా వెళ్లిపోయారు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన ఆరు నెలల వరకు రారని సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆఫ్రికా దేశాలకు వెళ్లిపోయినట్లు టాక్ నడుస్తోంది. వ్యాపారం ముసుగులో పుంగనూరు నుంచి యంత్రాలు, వాహనాలను తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో యాక్టివ్ పాత్ర పోషించిన ప్రముఖులంతా లండన్ లోనే మకాం వేసినట్లు టాక్ నడుస్తోంది.

    రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. వైసీపీ మంత్రులకు మించి ఆయన ప్రాచుర్యం పొందారు. చంద్రబాబు అవినీతి కేసులను వాదించారు. సుప్రీంకోర్టులో పేరు మోసిన న్యాయవాదులను ఢీకొట్టారు. నా ముందు మీరు బచ్చా అంటూ సవాల్ చేశారు. అటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్ వెళ్లిపోయారు. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశమై బోరున ఏడ్చేశారు. జగన్ క్లిష్ట సమయంలో ఉన్నాడని.. మనమంతా ఆయనకు అండగా నిలవాల్సిన సమయం ఇది అని చెప్పుకొచ్చారు.

    రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పెద్దగా కనిపించడం లేదు. ఆయన సైతం లండన్ వెళ్లిపోయారా? అన్న అనుమానాలు ఉన్నాయి. వైసీపీ సోషల్ మీడియా వింగ్ను చూసే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి కూడా పెద్దగా కనిపించడం లేదు. ఆయన సైతం విదేశీ బాట పట్టారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే వైసీపీ నేతలంతా విదేశీ బాట పట్టడం, అది కూడా లండన్ కావడంతో రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా లండన్ వెళ్లే వారికి దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి షెల్టర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.