Nellore YCP : అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన.. దొడ్డవారినెల్ల తొలగగొట్టు..చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా.. విశ్వదాభిరామ వినుర వేమ.. వేమన పద్యం ఇది. అసమర్థుల గురించి వాడే పద్యం ఇది. ఇప్పుడిదే పద్యాన్ని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి పడారు. పడింది ఎవరో తెలుసా ఆయన స్వయానా బాబాయ్ రూప్ కుమార్ యాదవ్. ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో బాబాయ్ అబ్బాయ్ తలపడుతున్నారు. వైసీపీని బజారుకీడ్చుతున్నారు. మొన్నటివరకూ రెడ్ల కాకతో నెల్లూరులో హీట్ పుట్టింది. ఇప్పుడది యాదవ నాయకుల వంతుకు వచ్చింది. దీంతో పార్టీ హైకమాండ్ హైరానా పడుతోంది.
నెల్లూరు వైసీపీలో గతంలో ఎన్నడు లేని సిగపాట్లు ఎదురవుతున్నాయి. తాజాగా నెల్లూరు సిటీలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. స్వయంగా బాబాయి అబ్బాయిలైన వీళ్లిద్దరూ మధ్య భేదాభిప్రాయాలతో పార్టీ కేడర్ తలపట్టుకుంటోంది. ఇద్దరు నేతలు మీడియా ముఖంగానే సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. ఇటీవల డిప్యూటీ మేయర్ అనుచరుడు హాజీ అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. ఆస్పత్రిలో చేరిన అతడ్ని రూప్ కుమార్ పరామర్శించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హాజీ తన వెనుక ఉన్నాడన్న కోపంతోనే దాడి చేశారని.. దీని వెనుక అనిల్ హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపాడు.
ఇప్పడిప్పుడే నెల్లూరు వైసీపీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. వాస్తవానికి నెల్లూరు వైసీపీకి కంచుకోట. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పదికి పది స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. నెల్లూరు లోక్ సభ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేసింది. అలాంట కీలకమైన జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి జెల్లకొట్టిన సంగతి తెలిసిందే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి,వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ వారిని బహిష్కరించింది. ఆ ఎపిసోడ్ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పడు బాబాయ్ అబ్బాయ్ లు ఏకంగా వీధి పోరాటాలకే దిగడం చర్చనీయాంశంగా మారింది.