Translocated Tree Nursery In Amaravati: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం పై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. శరవేగంగా పనులు పూర్తిచేస్తోంది. నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్లాన్. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేశారు. అడవిని తలపిస్తున్న అమరావతిని యధా స్థానానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో భారీ చెట్లు ఉండేవి. అయితే వాటిని వృధా చేయకుండా.. శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించి భారీ నర్సరీని సిద్ధం చేశారు. అమరావతి పరిధిలోని అనంతవరం వద్ద ఐదు ఎకరాల్లో నాలుగు వేల చెట్లతో దేశంలోనే పెద్దదైన ట్రాన్స్ లోకేటెడ్ ట్రీ నర్సరీ ని సిద్ధం చేశారు. వీటిని రాజధాని లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా బఫర్ జోన్లలో నాటనున్నారు.
Also Read: అలాస్కా లో రహస్య పత్రాలు.. ట్రంప్, పుతిన్ భేటీ లో ఇన్ని భద్రతా లోపాలా?
* రాజధాని ప్రాంతంలో..
2014లో అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభం అయింది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన టిడిపి( Telugu Desam Party) అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. దాదాపు 50 వేల ఎకరాల వరకు సమీకరించింది. ఈ క్రమంలో ఇలా సేకరించిన భూమిలో చిన్న మొక్కలు చెట్లు గా మారాయి. అయితే గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా విడిచిపెట్టడంతో భారీగా చెట్లు పెరిగాయి. కేవలం జంగిల్ క్లియరెన్స్ పనులకు గానే దాదాపు 33 కోట్ల రూపాయల ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం. అయితే జంగిల్ క్లియరెన్స్ పనుల్లో భాగంగా పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న చెట్లను శాస్త్రీయ పద్ధతిలో తొలగించారు. రాజధాని లో ఒక్క చెట్టును కూడా నరక కూడదన్న లక్ష్యంతో అమరావతి అభివృద్ధి సంస్థ శాస్త్రీయ పద్ధతుల్లో ఈ చెట్లను తొలగించింది. రాజధాని పనులు మొదలైన కొత్తలో అనంతవరం వద్ద పెద్ద నర్సరీని అభివృద్ధి చేశారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం పూర్తయ్యాక వాటికి ఇరువైపులా నాటనున్నారు. మరోవైపు అమరావతిలో ఏర్పాటు చేయబోయే పార్కుల్లో సైతం నాటేందుకు వేల సంఖ్యలో మొక్కలను సైతం పెంచారు.
* నర్సరీలో మొక్కలు చెట్లుగా..
వాస్తవానికి 2014లోనే ఈ నర్సరీని( nursery) సిద్ధం చేశారు. భారీగా మొక్కలు పెంచారు. ఆ మొక్కలు ఏపుగా పెరిగాయి. గత ఐదేళ్లలో వైసిపి నిర్లక్ష్యంగా విడిచిపెట్టిన.. చెట్లు గా మారాయి. అయితే ఈ నర్సరీ మీదుగా ఇప్పుడు ప్రధాన రహదారి నిర్మిస్తుండడంతో అక్కడ ఉన్న చెట్లను కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అమరావతి అభివృద్ధి అధికారులు ట్రాన్స్ లోకేటెడ్ ట్రీ నర్సరీ ఆలోచన చేశారు. అక్కడ ఉన్న 2000 చెట్లను అనంతవరంలోనే వేరే చోటకు తరలించారు. మల్కాపురం నుంచి రోడ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న మరో 1000 చెట్లను కూడా ఇలానే శాస్త్రీయ పద్ధతిలో తొలగించి ఒకచోటకు చేర్చారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 4వేల చెట్లను నర్సరీ లోకి చేర్చగలిగారు.
* శాస్త్రీయ విధానంలో..
ఈ చెట్ల తొలగింపు అనేది కూడా ఒక శాస్త్రీయ విధానంలో జరుపుతున్నారు. ముందుగా చెట్టు కొమ్మలను తొలగిస్తున్నారు. దీంతో దాని బరువు తగ్గుతోంది. కొమ్మలకు రసాయనాలు పూస్తున్నారు. చెట్టు చుట్టూ కందకం తవ్వి వేర్లను కత్తిరిస్తున్నారు. కొంత స్థిరపడ్డాక తల్లి వేరు కత్తిరించి… ట్రీ నర్సరీకి తరలిస్తున్నారు. అక్కడ పెద్ద సంచుల్లో మట్టి, ఎరువు నింపి చెట్టుని దానిలో ఉంచి సంరక్షిస్తున్నారు. ప్రధానంగా ఈ నర్సరీకి తరలిస్తున్న వాటిలో రావి, మర్రి, ఉసిరి, మారేడు, బౌహీనియా, లగాస్టోమియా వంటి జాతులు ఉన్నాయి. మొత్తానికి అయితే అమరావతి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.