Rain Alert In AP: ఏపీ( Andhra Pradesh) వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో కొద్దిరోజులుగా ఏపీలో వర్ష ప్రభావం ఉంది. అయితే చాలా జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మిగతా జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలు పడుతున్నాయి. అయితే కోస్తా జిల్లాలపై ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ నుంచి ఒక అలర్ట్ వచ్చింది. ఒకే సమయంలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో 48 గంటల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈనెల చివరి వరకు వర్షాలు ఉంటాయని సంకేతాలు అందుతున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో వర్షాల వ్యాప్తికి అవకాశం కలుగుతుంది.
* స్థిరంగా అల్పపీడనం..
ప్రస్తుతం పశ్చిమ మధ్య.. దానికి అనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో( Bay of Bengal) అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ఈ అల్పపీడనం ప్రయాణించే అవకాశం ఉంది. ఫలితంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. ఇప్పుడున్న అల్పపీడనానికి తోడు మరొకటి జతకానుంది. సోమవారం నాటికి వాయువ్య బంగాళాఖాతం దానికి అనుకొని ఉన్న పశ్చిమ మధ్య ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ ఏపీకి హెచ్చరికలు జారీచేసింది. ఏపీతోపాటు ఒడిస్సా పై అధికంగా ప్రభావం ఉంటుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులపాటు కోస్తాంధ్రలో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన కనిపిస్తోంది.
* ఈ జిల్లాలపై ప్రభావం అధికం..
అల్పపీడన ప్రభావంతో నేడు అల్లూరి సీతారామరాజు( Alluri Sitaram Raju ), విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదు కానున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో అల్పపీడనాల ఏర్పాటుకు అవకాశం కలుగుతోంది. ఒకేసారి రెండు అల్పపీడనాలు ఏర్పడనుండడంతో ఈ నెల చివరి వరకు వర్షాల ప్రభావం ఏపీ పై ఉంటుంది.