Vijayasai Reddy: ఏపీలో వైసీపీ ఓడిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో విజయసాయిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీనిపై తనకు తాను మీడియా ముందుకు వచ్చి విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అందులో కుట్ర కోణం ఉందని ఆరోపించారు. కొందరు మీడియా అధినేతలు, మీడియా ప్రతినిధులపై కూడా ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతలపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. వారిపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే విజయసాయిరెడ్డి ఎపిసోడ్ చల్లబడుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా ఆయన కుమార్తె నేహా రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. విశాఖలో ఆమె ముచ్చటపడి చేపట్టిన నిర్మాణం విరుద్ధమంటూ న్యాయస్థానంలో పోరాటం ప్రారంభించారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. విశాఖ కేంద్రంగా చాలా రోజులు పాటు రాజకీయాలు నడిపారు విజయసాయిరెడ్డి. ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉంటూ విశాఖలో తన కుటుంబ వ్యాపార విస్తరణ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె నేహా రెడ్డి ముచ్చటపడి భీమిలి బీచ్ రోడ్డులో అంతర్జాతీయ స్పా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాని చుట్టూ 12 అడుగుల ఎత్తులో ప్రహరీ నిర్మాణం చేపట్టారు. అయితే అది నిబంధనలకు విరుద్ధమంటూ మూర్తి యాదవ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం తోసిపిచ్చింది.భిన్నంగా స్పందించింది. దీంతో విజయసాయిరెడ్డి కుమార్తె నిర్మాణం కూల్చివేయడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. తండ్రి వివాదం పోయి కుమార్తెది తెరపైకి వచ్చిందని టాక్ నడుస్తోంది.
* భూ కబ్జా ఫిర్యాదులు
ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి భారీగా భూములు సమీకరించారని అధినేత జగన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ కారణంగానే ఆయనను ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించినట్లు ప్రచారం జరిగింది.ఇటీవల ఆయన మెడకు చుట్టుకున్న వివాదాల వెనుక సొంత పార్టీ నేతలు ఉన్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అవి సమసిపోకముందే.. కుమార్తెకు ఇబ్బందులు ఎదుర్కోవడం విశేషం.
* మూర్తి యాదవ్ పోరాటం
వైసిపి అధికారంలో ఉన్నప్పుడే జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పోరాడేవారు. ప్రజా సమస్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అరాచకాలపై పడ్డారు. ముఖ్యంగా బీచ్ రోడ్, భీమిలి ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూములను, ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలోనే బీచ్ రోడ్ లో విజయసాయిరెడ్డి కుమార్తె నిర్మించిన స్పాట్ కేంద్రం చుట్టూ.. ప్రహరీ నిబంధనలకు విరుద్ధమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మూర్తి యాదవ్.
* ఎటూ తేలని వైనం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు మరింత బిగిసుకుంది. తొలుత విచారించిన ధర్మాసనం.. ఆ నిర్మాణాలను నిలుపుదల చేయాలని.. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు తొలగించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని నేహా రెడ్డి మరోసారి కోర్టుకు ఎక్కారు. కానీ దీనిని విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో నేహా రెడ్డి తిరిగి సింగిల్ బెంచ్ ను ఆశ్రయించారు. కానీ అక్కడ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు.దీంతో నేహా రెడ్డి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. మొన్న తండ్రి విజయసాయిరెడ్డి అలా.. ఇప్పుడు కుమార్తె పరిస్థితి ఇలా అయ్యింది. దీంతో కూటమి ప్రభుత్వం తొలి బాధితులుగా విజయసాయిరెడ్డి కుటుంబం నిలిచింది.