AP Police Jobs :  నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం*

వైసిపి హయాంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోయింది.దానిని పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దాదాపు 95 వేల మంది అభ్యర్థుల ఎదురుచూపులు ఫలించునున్నాయి.

Written By: Dharma, Updated On : July 31, 2024 10:38 am
Follow us on

AP Police Jobs :  ఏపీలో కానిస్టేబుల్ అర్హత పరీక్షకు ఎంపికైన వారికి శుభవార్త. వైసిపి హయాంలో నిలిచిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు కసరత్తు మొదలు పెట్టింది. అధికారంలోకి వస్తే ఏటా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని 2019 ఎన్నికలకు ముందు జగన్ హామీ ఇచ్చారు. కానీ ఐదేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా భర్తీ చేయలేకపోయారు.తొలి మూడున్నర సంవత్సరాలు దాని జోలికి పోలేదు. 2022 నవంబర్ 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ ఏడాదిన్నర కాలంలో నియామక ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు.ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. తరువాత దశలో నిర్వహించాల్సిన పరీక్షలను పట్టించుకోవడం మానేశారు. దీంతో వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పుడు ఈ నియామక ప్రక్రియను కొనసాగించడానికి టిడిపి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు 2018 నవంబర్లో టిడిపి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు నెలల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుడ్య పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్ష అన్ని కేవలం మూడు నెలల వ్యవ ధిలోనే పూర్తి చేసింది. 2019 ఎన్నికలకు ముందే కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి వారికి శిక్షణకు పంపింది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా మూడు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది.

* మూడు నెలల్లో పూర్తి చేయాలి
సాధారణంగా పోలీస్ నియామక ప్రక్రియ మూడు నెలల్లో పూర్తవుతుంది. గత ప్రభుత్వాలు అదే మాదిరిగా చేశాయి. కానీ జగన్ సర్కార్ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. తన ఐదేళ్ల పాలనలో అసలు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ చేయలేక చేతులెత్తేసింది. ప్రాథమిక రాత పరీక్షను మాత్రమే నిర్వహించగలిగింది. గత ఏడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గత ఏడాది ఫిబ్రవరి 5న ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ వెంటనే తదుపరి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది మార్చి 13 నుంచి 20 వరకు నిర్వహిస్తామంటూ షెడ్యూల్ ఇచ్చారు. హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సాకుగా చూపుతూ వాయిదా వేశారు.

* వేధిస్తున్న సిబ్బంది కొరత
రాష్ట్రంలో పోలీస్ శాఖలో సిబ్బంది కొరత అధికంగా ఉంది. కనీసం పదవీ విరమణ పొందుతున్న వారి స్థానంలోనైనా కొత్త వారి భర్తీ లేకుండా పోయింది. దాదాపు 6 కోట్ల మంది ప్రజలకు ఉన్నది కేవలం 50వేల సిబ్బంది మాత్రమే. అందుకే నేర నియంత్రణ ఇబ్బందికరంగా మారుతోందని స్వయంగా హోం శాఖామంత్రి వంగలపూడి అనిత ఇటీవల ప్రకటించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో అన్ని విభాగాలకు సంబంధించి 40 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. కానీ చాలా వరకు పోలీస్ స్టేషన్లలో కనీసం 15 మంది కూడా ఉండని పరిస్థితి.

ఏటా వేలాదిమంది పోలీస్ సిబ్బంది పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. వాటికి పరిరక్షణగా మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సాధారణ పోలీసులనే అక్కడ నియమిస్తున్నారు. మిగతావారు క్రైమ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్.. ఇలా అన్ని విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలో రాజకీయ విధ్వంస ఘటనలు, ప్రముఖుల పర్యటనలు, పుణ్యక్షేత్రాల పరిరక్షణ.. ఇలా అన్నింట ఇబ్బందికర పరిస్థితులను పోలీసులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పై దృష్టి పెట్టడం హర్షించదగ్గ పరిణామం.