AP Govt Debt: ‘మింగ మెతుకు లేదు.. మీషాలకు సంపంగి నూనె’ అన్నట్టుంది ఏపీ వైసీపీ సర్కారు దుస్థితి. ప్రజలకు పప్పు బెల్లంలా డబ్బును పంచి..రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేస్తోంది. పరిమితికి మంచి అప్పులు చేస్తోంది. మరోవైపు నాలుగో తేదీ సమీపించిన ఉద్యోగులకు ఇంతవరకూ జీతాలు చెల్లించలేదు. పింఛన్లు అందించలేదు. అప్పుతెస్తే కానీ జీతాలు, పింఛన్లు అందించలేని దీనావస్థలో ఏపీ సర్కారు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏడు నెలల్లోనే అర లక్ష కోట్లు అప్పు వాడేసింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో మరో రూ.2000 కోట్లు రుణంగా తీసుకుంది. 13 ఏళ్ల కాలపరిమితిలో 7.82 శాతం వడ్డీతో తీర్చేలా రూ.1000 కోట్లు తీసుకుంది. మరో రూ.1000 కోట్లు 20 ఏళ్ల కాలపరిమితితో 7.79 శాతం వడ్డీ చెల్లించేలా రుణం పొందింది. ప్రతీ నెల చివరి వారంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నేతృత్వంలో అధికారులు ఢిల్లీ వెళ్లడం పరిపాటిగా మారింది. రోజుల తరబడి పడిగాపున పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నెలనెలా సర్కారు అప్పులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

అక్కడా, ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్ల వైసీపీ సర్కారు చేయి చాస్తోంది. అటు బహిరంగ మార్కెట్ తో పాటు కార్పొరేషన్లు, బేవరేజెస్ కంపెనీల మాటున ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోంది. ఇప్పటివరకూ బహిరంగా మార్కెట్ లోనే సుమారు రూ.40 వేల కోట్లు అప్పులు చేసింది. బేవరేజష్ కార్పొరేషన్ నుంచి రూ.3800 కోట్లు, కేంద్ర రుణాలు రూ.1400 కోట్లతో పాటు నాబార్డు నుంచి నేరుగా రుణాలు పొందింది. ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలలకు రూ.44 వేల కోట్ల వరకూ మాత్రమే రుణం పొందేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. కానీ ఇప్పుడు ఏడు నెలలు పూర్తికాకుండానే రూ.50 వేల కోట్లను రుణాలుగా సమీకరించడం ఆందోళన కలిగిస్తోంది. అంటే కేంద్ర అనుమతి కంటే దాదాపు రూ.6 వేల కోట్లను ఏపీ సర్కారు అదనంగా అప్పుచేసింది. అయితే దీనిపై కేంద్రం ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం, నియంత్రించేందుకు ప్రయత్నాలు చేయకపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Pawan Kalyan- Nara Lokesh: పవన్ కళ్యాణ్, లోకేష్… ఎవరి యాత్రకు ఎంత క్రేజ్? ఎవరికి అధికారం?
రేపే విజయదశమి. కానీ ఉద్యోగులకు ఇంతవరకూ వేతనాలు అందలేదు. జీతాల మెసేజ్ ల కోసం వారు ఆశగా సెల్ ఫోన్ల వైపు చూస్తున్నారు.కానీ అటువంటి సందేశాలేవీ లేవు. ఈపాటికే అంతా పండుగ ఫీవర్ లోకి వెళ్లిపోయారు.కానీ ఇంతవరకూ జీతాలు ఖాతాల్లో పడకపోయే సరికి ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర నిర్వేదం అలుముకుంది. రాష్ట్రంలో 14 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ సోమవారం రాత్రికి కేవలం 25 శాతం మందికి మాత్రమే జీతాలు ఖాతాల్లో పడ్డాయి.

మిగతా వారికి ఎప్పుడిస్తారన్నది స్పష్టత లేదు. సెక్యూరిటీ వేలంలో రూ.2000 కోట్లు అప్పుచేసిన సర్కారు జీతాల కోసమేనని తెలుస్తోంది. అయితే తక్కువ వేతనాలు ఉన్నవారికే ముందుగాజీతాలు వేశారు. మిగతా వారికి మంగళవారం జీతాలు పడకుంటే.. మళ్లీ గురువారమే అందే అవకాశం ఉంది. బుధవారం విజయదశమి కావడంతో బ్యాంకులకు సెలవు. దీంతో ఉద్యోగుల్లో ఒకరకమైన ఆందోళన అయితే నెలకొంది. అటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక.. ఇటు ఆరు నెలలకే రూ.50 వేల కోట్ల అప్పులు చూస్తుంటే.. ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.
Also Read:YCP- TRS: టీఆర్ఎస్ ను తట్టుకోలేక చేతులెత్తేసిన వైసీపీ..ఆ భయంతోనే?
[…] Also Read:AP Govt Debt: అప్పులకుప్ప.. ఇది ఏపీ ప్రభుత్వమబ… […]