Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గొప్ప విద్యాధికుడు కాదు. కానీ నిత్యం పుస్తక పఠనం చేస్తుంటారు. వేలకొలది పుస్తకాలను చదువుతుంటానని చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయన చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఆయన విజయవాడలో జరిగిన పుస్తక మహోత్సవానికి హాజరయ్యారు. తన పుస్తక పఠనం ఆసక్తి.. తన చదువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పుస్తకాలు చదవడం అంటే తనకున్న ప్రేమను బయటపెట్టారు. ఎవరైనా పుస్తకాలు అడిగితే కొనిస్తానని.. అంతే తప్ప తన దగ్గర ఉన్న పుస్తకాలు మాత్రం ఇవ్వనని.. కోటి రూపాయలైనా ఇస్తాను గానీ.. పుస్తకాలు మాత్రం ఇవ్వనని చెప్పుకొచ్చారు.
* ఆ భావనతోనే చదువుకు దూరం
ఇంటర్ తో తను చదువు ఆపేయడానికి కారణాన్ని చెప్పుకొచ్చారు పవన్. నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని.. క్లాస్ రూమ్ లో లేదని.. అందుకే తాను మానేశానని తెలిపారు. 17 సంవత్సరాల ప్రాయంలోనే బాగా చదివే వాడినని.. నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని గ్రహించి మానేశానని తనకు తాను వివరణ ఇచ్చుకున్నారు పవన్. తరువాత సినిమాల్లోకి వచ్చి రాణించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే పవన్ వ్యాఖ్యలు జనసైనికులకు జోష్ నింపగా.. ప్రత్యర్థులకు మాత్రం ప్రచారాస్త్రాలుగా మారాయి.
* వ్యతిరేక ప్రచారం
రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉంటూ.. విద్యారంగాన్ని, విద్యావ్యవస్థను అవమానించేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని వైసిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్న గౌరవప్రదమైన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ.. ఇలా విద్యా వ్యవస్థను అపహాస్యం చేసేలా.. విద్యార్థులను, యువతరాన్ని చదువుల పట్ల విముఖత పెంచేలా.. తప్పుదారి పట్టించేలా మాట్లాడడం అనేది దుర్మార్గమంటూ పవన్ పై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే పవన్ అన్నదాంట్లో తప్పేంటని.. చదువును గౌరవించాలని ఆయన సూచించారని.. పుస్తక పఠనం గురించి మాట్లాడారని.. సమాజంలో విలువలు ఎంతో ఉన్నతమని చెప్పుకొచ్చారని అభిమానులు చెబుతున్నారు. కానీ దీనిపై ప్రత్యర్థులు మాత్రం రకరకాల ట్రోల్స్ నడుపుతున్నారు.