Srilila : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన వారిలో ఒకరు శ్రీలీల. కరోనా మొదటి వేవ్ పూర్తి అయ్యి, లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత విడుదలైన పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా ఈమె హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. అంతకు ముందు కన్నడలో ఒకటి, రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ, ఆ సినిమాలు ఆమెకి ఎలాంటి గుర్తింపుని తీసుకొని రాలేదు. కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం ఈమె అందానికి ఫిదా అవ్వడంతో పాటు, ఆమె డ్యాన్స్ కి పిచ్చెక్కిపోయారు. ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ధమాకా చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు సంపాదించింది. ఈమధ్య ఆమెకి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడంతో అవకాశాలు తగ్గిపోయాయని అందరూ అనుకున్నారు.
కానీ ఆమె తెలుగు సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి కారణం MBBS పరీక్షలు ఉండడం వల్లే అని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది శ్రీలీల. ఇదంతా పక్కన పెడితే శ్రీలీల ఒక ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమాయణం నడుపుతుందని లేటెస్ట్ ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఆ హీరో మరెవరో కాదు, కార్తీక్ ఆర్యన్. అయితే ఆ ప్రేమ రియల్ లైఫ్ లో మాత్రం కాదు, వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ త్వరలోనే తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చాలా విన్నూతన రీతిలో ప్రకటించాడు హీరో కార్తీక్ ఆర్యన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇప్పటికే నేను ప్రేమలో మూడు సార్లు విఫలం అయ్యాను..నాల్గవసారి మళ్లీ ప్రేమలో పడ్డాను, ఈసారి ఇంతకు ముందులాగ జరగకూడదని కోరుకుంటున్నాను’ అంటూ ‘తు మేరీ మై తేరా..మై తేరా తు మేరీ’ అనే చిత్రాన్ని ప్రకటించాడు.
ఈ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది శ్రీలీల కి మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఇక్కడ సక్సెస్ లను చూసిన తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి, అక్కడ రెండు మూడు సినిమాలు చేసి, ఆ తర్వాత ఫ్లాప్స్ అందుకొని కనపడకుండా పోయారు. శ్రీలీల పరిస్థితి కూడా అలా అవ్వబోతుందా?, లేదా ఆసిన్, తాప్సి లాగ సక్సెస్ అవుతుందా అనేది చూడాలి. ఆమె డ్యాన్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మన సౌత్ ఆడియన్స్ కి డ్యాన్స్ చాలా కామన్. కానీ నార్త్ ఇండియన్స్ కి డ్యాన్స్ వేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం. యూట్యూబ్ లో మన హీరోలు డ్యాన్స్ వేసిన వీడియో సాంగ్స్ కి వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ వస్తున్నాయంటే, అది బాలీవుడ్ ఆడియన్స్ వల్లే. మరి శ్రీలీల ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.