CM Chandrababu: అందుకే ఏడ్చేశాను.. సంచలన విషయం బయటపెట్టిన చంద్రబాబు

2021 నవంబర్ 19న శాసనసభలో చంద్రబాబుకు తీవ్ర అవమాన భారం జరిగింది. తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. దానికి కొందరు వైసీపీ సభ్యులు వంత పాడారు.

Written By: Dharma, Updated On : June 22, 2024 1:59 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: చంద్రబాబు ఎటువంటి భావోద్వేగాన్ని బయట పెట్టుకోరు. ఆయన ఆనందంలో నవ్వింది తక్కువ. బాధల్లో కూడా కన్నీరును ఎప్పుడూ బయట పెట్టరు. అటువంటిది ఒక్కసారి మాత్రం ఏడ్చారు. ఏకంగా విలేకరుల సమావేశంలోనే కన్నీరు పెట్టుకున్నారు. ఏడుపదుల వయసులో తనలో ఉన్న బాధను వ్యక్తం చేశారు. తనకు ఎదురైన పరిణామాలతో రోదించారు. అయితే తాజాగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా హౌస్ లో అడుగు పెట్టారు చంద్రబాబు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా తాను ఎందుకు ఏడవాల్సి వచ్చింది వివరించే ప్రయత్నం చేశారు. సభలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. మరోసారి హౌస్ లో అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు.సభ ఔన్నత్యాన్ని కాపాడుదామని కోరారు.

2021 నవంబర్ 19న శాసనసభలో చంద్రబాబుకు తీవ్ర అవమాన భారం జరిగింది. తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. దానికి కొందరు వైసీపీ సభ్యులు వంత పాడారు. సభా నాయకుడిగా వారించాల్సిన అప్పటి సీఎం జగన్ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించారు. దీంతో చంద్రబాబు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తీవ్ర అవమాన భారంతో భీషణ ప్రతిజ్ఞ చేశారు.’ ఇన్నేళ్లు పరువు కోసం బతికాను. అలాంటిది ఈరోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు. కౌరవ సభ. ఇలాంటి సభలో నేను ఉండను. మళ్లీ ముఖ్యమంత్రి గానే ఈ సభలో అడుగు పెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. అందరికీ ఓ నమస్కారం ‘ అంటూ 2021 నవంబర్ 19న శాసనసభలో ప్రత్యేక ప్రకటన చేసి చంద్రబాబు బాయ్ కట్ చేశారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనకు జరిగిన అవమానాన్ని తలచుకొని రోదించారు.

అయితే అంతులేని మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగానే చంద్రబాబు హౌస్ లో అడుగు పెట్టారు. స్పీకర్ అయ్యన్న నియామకం పై మాట్లాడుతూ నాటి గురుతులను నెమరు వేసుకున్నారు. ‘ ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసింది. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారు. నా కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు. మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారు. నా సతీమణి గురించి మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానించారు. సోషల్ మీడియాలో సైతం ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. ప్రజలు అంతా గమనించి నన్ను గౌరవ సభకు పంపారు. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాలి. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరో జన్మ ఉంటే తెలుగువాడి గానే పుట్టాలి. తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలని అదే నా కోరిక ‘ అంటూ చంద్రబాబు ప్రసంగాన్ని ముగించారు.