TDP alliance plan: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర రాజకీయ పరిస్థితుల కొనసాగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూటమి టార్గెట్ చేస్తోంది. కూటమిని తట్టుకొని నిలబడాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే పోరాడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను వైసీపీ ఎమ్మెల్సీలు ఎండగడుతున్నారు. మండలి చైర్మన్గా వైసీపీ నేత ఉండడంతో గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. మంత్రులు ధీటుగా బదిలిస్తున్నారు కానీ.. కూటమి ఎమ్మెల్సీ ల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు. అందుకే ఇప్పుడు టిడిపి కూటమి శాసనమండలిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఏడాది కిందట వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఇప్పుడు కూటమి బాటపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు ఆరుగురు వరకు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. వారి రాజీనామాకు చైర్మన్ తెలపకపోవడంతో పొలిటికల్ జంక్షన్ లో నిలబడి పోయారు. అయితే ఇప్పుడు ప్రత్యేక వ్యూహంతో కూటమి ఆహ్వానించడంతో ఆ పార్టీలో చేరిపోయారు. అయితే మండలి పై పూర్తి పట్టు సాధించేందుకు చంద్రబాబు గట్టి ప్లాన్ వేసినట్లు సమాచారం.
మరో రెండేళ్లు ఆగితేనే..
శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఉంది. 2027 నాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గి కూటమి బలం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మండలిలో 58 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం అధికారికంగా తెలుగుదేశం పార్టీకి 10, జనసేనకు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. అయితే మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్సీలు కూటమికి సొంతమయ్యారు. ప్రస్తుతం శాసనమండలిలో టిడిపి కూటమి బలం 16 మంది ఎమ్మెల్సీలు. మరో ఏడుగురు ఎమ్మెల్సీలు కూటమి పార్టీల్లో చేరారు. ఈ లెక్కన కూటమి బలం 23 కు చేరింది. ఇంకా చాలామంది ఎమ్మెల్సీలు టిడిపి కూటమి టచ్ లోనే ఉన్నారు. ఈ లెక్కన మరో ఏడుగురు ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకుంటే.. మండలిలో కూటమికి చేజిక్కినట్టే. మొన్న ఆ మధ్యన విజయనగరం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ టిడిపికి సహకరించారని అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కోర్టుకు వెళ్లి ఎమ్మెల్సీ పదవిని తిరిగి పొందారు. టిడిపికి మద్దతు గానే ఉన్నారు. అలాంటి చాలామంది ఎమ్మెల్సీలు ఉన్నారు.
కోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే..
ప్రస్తుతం మండలి చైర్మన్ వద్ద ఏడుగురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా లేఖలు ఉన్నాయి. అవి ఆమోదానికి నోచుకోవడం లేదు. దీంతో ఎమ్మెల్సీలు కోర్టుకు వెళ్లారు. వారి రాజీనామాల విషయంలో కోర్టు అనుకూల తీర్పు ఇస్తే.. మరో ఏడుగురితో సైతం రాజీనామా చేయించేందుకు కూటమి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా సభలో 30 మంది ఎమ్మెల్సీలతో చైర్మన్ మోసేన్ రాజు పై అవిశ్వాసానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల జనసేనలో చేరిన ఎమ్మెల్సీ జయ మంగళం వెంకటరమణ కోర్టుకు ఆశ్రయించారు. దీంతో ఓ పదివేల రూపాయలు జరిమానా కట్టాలని శాసనమండలి కార్యాలయానికి ఆదేశించింది కోర్టు. ఈ కేసు విచారణకు గాను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని కోర్టు ఆ నిర్ణయానికి వచ్చింది. దీంతో రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల విషయంలో కోర్టు సానుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. కోర్టు తీర్పు ఆధారంగా శాసనమండలిలో వైసిపి భవితవ్యం ఆధారపడి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.