AI content license India: భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. వినియోగం కూడా అంతే వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో దాని దుర్వినియోగం కూడా పెరుగుతోంది. డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి సమస్యలు నేతలను, మహిళలను, రాజకీయ పార్టీలను చివరకు శత్రువులనూ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో, పార్లమెంటరీ కమిటీ ఏఐ ఆధారిత కంటెంట్ కట్టడికి చర్యలు చేపట్టింది. ఇది తప్పుడు కంటెంట్ క్రియేట్ చేసేవారికి ఇబ్బంది కరంగా మారనుంది.
ఏఐ కంటెంట్ ప్రాముఖ్యత..
ఏఐ సాంకేతికత డిజిటల్ మీడియాను మార్పు చేస్తోంది. ఫొటోలు, వీడియోలు, ఆర్టికల్స్‌ను సులభంగా జనరేట్ చేసే టూల్స్ సృష్టికర్తలకు కొత్త ఆవిష్కరణలు అందిస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హై–క్వాలిటీ విజువల్స్ తయారు చేయడం ఇప్పుడు ఈజీ అయింది. అయితే, ఇది రెండు వైపులా పని చేస్తోంది: ఒకవైపు సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది, మరోవైపు తప్పుడు వీడియోలు రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వ్యాప్తి చెందుతున్నాయి. ఈ సమస్యలు ప్రజల మధ్య అపోహలను కలిగిస్తాయి. సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ మెటీరియల్ 70%కి పైగా ఉంటుంది. దీంతో ప్రైవసీ రక్షణ, వ్యక్తిగత డేటా దుర్వినియోగం వంటి సవాళ్లు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యూరప్, అమెరికాలో ఇలాంటి ఏఐ కంటెంట్లకు రెగ్యులేషన్లు ఏర్పడుతున్నాయి, భారత్ కూడా దానికి సమాంతరంగా స్పందిస్తోంది.
పార్లమెంటరీ సిఫార్సులు..
కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ, బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అధ్యక్షతన, లోక్‌సభ స్పీకర్‌కు డ్రాఫ్ట్ రిపోర్ట్ సమర్పించింది.
– ఏఐ టూల్స్ ఉపయోగించి కంటెంట్ తయారు చేసే వ్యక్తులు లేదా సంస్థలు ముందుగా అనుమతి పొందాలి. ఇది ఫేక్ మెటీరియల్ సృష్టికర్తలను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
– ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలు, ఆర్టికల్స్‌పై స్పష్టమైన మార్కర్ లేదా లేబుల్ ఉండాలి. ఇది ప్రేక్షకులకు వాస్తవం లేదా ఏఐ జనరేట్ అని గుర్తించే వీలు ఉంటుంది.
ఈ సిఫార్సులు బైండింగ్ కాకపోయినా, ప్రభుత్వం సాధారణంగా వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పటికే డీప్‌ఫేక్‌లపై ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, ఫేక్ స్పీచ్ డిటెక్షన్ టూల్స్ అభిఋద్ధి చేస్తోంది. ఇంటర్–మినిస్టీరియల్ కోఆర్డినేషన్ ద్వారా ఈ నిబంధనలు అమలు చేయాలని కమిటీ కోరింది. తద్వారా ప్రజలు మోసాలకు గురికాకుండా ఉంటారు. విశ్వసనీయత పెరుగుతుంది. ఫేక్ కంటెంట్‌పై చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఈ మార్పులు ఏఐని బాధ్యతాయుతంగా ఉపయోగించేలా చేస్తాయి.
ఏఐ కంటెంట్‌పై లైసెన్స్, లేబులింగ్ సిఫార్సులు భారత్‌లో డిజిటల్ మీడియాను మరింత సురక్షితంగా మారుస్తాయి. ఇది ఫేక్ న్యూస్‌ను అడ్డుకోవడమే కాకుండా, సృష్టికర్తలకు కూడా గైడ్‌లైన్‌లు అందిస్తుంది. ప్రభుత్వం ఈ సిఫార్సులను ఆమోదించిన తర్వాత, 2026 నాటికి అమలులోకి రావొచ్చు.