KTR Sensational Comments: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో పారిశ్రామిక ప్రగతి లేకుండా పోయిందన్న విమర్శ ఉంది. కొత్త పరిశ్రమలు తేకపోగా.. ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టారన్న అపవాదు కూడా ఉంది. తాజాగా దానిని గుర్తు చేశారు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయన. తెలంగాణ సమాజానికి తాము మేలు చేశామని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వాకాన్ని బయటపెట్టారు. మహబూబ్ నగర్ వద్ద అమర్ రాజా సంస్థ ఏర్పాటుచేసిన అతిపెద్ద గిగా ఫ్యాక్టరీ పురోగతి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనను తాను అభినందించుకునే ప్రయత్నం చేశారు. తమ హయాంలో తిరుగులేని పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని చెప్పుకున్నారు. అయితే అసలు విషయం కేటీఆర్ కు తెలుసు. జగన్ పుణ్యమా అని అమర్ రాజా కంపెనీ తెలంగాణకు వచ్చిన విషయం బహిరంగ రహస్యమే. అయితే ఇప్పుడు కేటీఆర్ మాటలు చూస్తుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏపీ కంటే తెలంగాణ సమాజానికి ఎక్కువగా ప్రయోజనాలు చేకూర్చారు అన్నమాట.
వేలాదిమందికి ఉపాధి..
అప్పుడెప్పుడో చిత్తూరు జిల్లాలో అమర్ రాజా( Amar Raja) కంపెనీని ఏర్పాటు చేశారు పారిశ్రామికవేత్త గల్లా రామచంద్ర రావు. దీంతో రాయలసీమలో వేలాదిమందికి ఉపాధి దక్కింది. అమర్ రాజా కంపెనీ దేశీయంగా కూడా గుర్తింపు సాధించింది. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుంది. అయితే దశాబ్దాలుగా ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినా అమర్ రాజా విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాయి. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గల్లా కుటుంబం టిడిపి పంచన చేరింది. రాజకీయంగా అది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడలేదు. అందుకే ఆ కంపెనీని టార్గెట్ చేసుకున్నారు. రకరకాల తనిఖీలు పేరిట ఇబ్బందులు పెట్టారు. అయితే అదే క్రమంలో ఏపీలో మరో 10 వేల కోట్ల పెట్టుబడి తో పరిశ్రమను విస్తరించాలని అమర్ రాజా కంపెనీ యాజమాన్యం చూసింది. కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి చూశాక తన మనసు మార్చుకుంది.
సొంత ప్రాంతం కోసం..
గల్లా రామచంద్ర నాయుడు( Ramachandra Naidu ) అమెరికాలో ఉంటూ సొంతం కోసం అమర్ రాజా కంపెనీని ఏర్పాటు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా వారిని ఎంతగానో ప్రోత్సహించారు. తన సొంత ప్రాంతం పై ఉన్న అభిమానంతో రామచంద్రరావు చిత్తూరులోనే తన పరిశ్రమలను విస్తరించాలని చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక రంగాన్ని రాజకీయ కోణంలోనే చూశారు. కక్ష సాధింపునకు దిగారు. దీంతో అమర్ రాజా కంపెనీ పునరాలోచనలో పడింది. చిత్తూరు వదలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన అప్పటి కెసిఆర్ ప్రభుత్వం అమర్ రాజాను తెలంగాణకు సాదరంగా ఆహ్వానించింది. అయితే తమ హయాంలో పరిశ్రమలను తీసుకొచ్చామని కేటీఆర్ ఇప్పుడు తాజాగా చెబుతున్నారు. అయితే అది జగన్ క్రెడిట్ అన్న విషయం కేటీఆర్ కు తెలుసు. కానీ కేటీఆర్ రాజకీయ నేత కథ తన స్టైల్లో ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నారు.