Thalliki Vandanam: మరో నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుంది. ఇంతవరకు తల్లికి వందనం పథకం అమలు చేయలేదు. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో దీనిపై స్పష్టత వస్తుందని అంతా భావించారు. కానీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఏపీ క్యాబినెట్. వచ్చే విద్యా సంవత్సరంలోపు అందించాలని మాత్రమే ఏకవాక్య తీర్మానం చేశారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో అమలు చేసే ఉద్దేశం కనిపించడం లేదు. మొన్న నాలుగు నెలలకు సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులో తల్లికి వందనం పథకానికి కేటాయింపులు చేశారు. దీంతో అందరిలో ఆశలు చిగురించాయి. సంక్రాంతికి అమలు చేస్తారని అంతా భావించారు. తల్లికి వందనంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15,000 చొప్పున అందిస్తారని అంచనాకు వచ్చారు. కానీ మంత్రివర్గ సమావేశంలో అటువంటి నిర్ణయం ఏది కనిపించలేదు. ఆ పథకంపై దాటవేసే ధోరణి అయితే మాత్రం స్పష్టంగా కనిపించింది.
* గత ఐదేళ్లుగా అమ్మ ఒడి
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో నవరత్నాలను ప్రకటించారు జగన్. అందులో అమ్మ ఒడి పథకం ఒకటి. అధికారంలోకి వస్తే 15000 రూపాయల చొప్పున పిల్లల చదువుకు అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసి చూపించారు. అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. అందులో భాగంగా అమ్మ ఒడి బదులు తల్లికి వందనం పేరిట పథకం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమందికి రూ.15,000 చొప్పున చదువుకు అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతున్నా పథకం అమలుకు మాత్రం నోచుకోలేదు.
* తల్లిదండ్రుల్లో నిరాశ
చాలామంది నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు తల్లికి వందనం పై ఆశలు పెట్టుకున్నారు. కానీ అదిగో ఇదిగో అంటూ ప్రకటనలే తప్ప.. పథకం కార్యరూపం దాల్చలేదు. చదువుకు సాయం అందలేదు. చాలామంది తల్లిదండ్రులు చంద్రబాబు సర్కార్ పై నమ్మకంతో తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించారు. ప్రభుత్వం నగదు సాయం చేస్తుందని భావించి ముందుగానే ఫీజులు కట్టేశారు. అటువంటి వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరో నాలుగు నెలలపాటే విద్యా సంవత్సరం ఉంది. ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రకటనలకే పరిమితం అవుతోంది. ఈ విద్యా సంవత్సరంలో పథకం డుమ్మా కొట్టేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. దీంతో నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆశలు వదులుకుంటున్నారు. జగన్ సర్కారే నయమన్న నిర్ణయానికి వస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే మాత్రం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.