TG Bharat : ఏదైనా మాటలు పొదుపుగా వాడాలంటారు. ఒక్కసారి మాట తూలితే వెనక్కి తీసుకోలేమంటారు. అలా పొరపాటున మాట్లాడి చాలామంది మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు అదే పరిస్థితి ఏపీ క్యాబినెట్ మంత్రి టీజీ భరత్ కు( TG Bharat )వచ్చింది. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు బృందంతో ఆయన వెళ్లారు. అక్కడ ఏదో పెట్టుబడుల గురించి మాట్లాడితే సరిపోయేది. కానీ ఈ రాష్ట్రానికి సీఎం అయ్యే అర్హత లోకేష్ కు ఉందని.. హైలీ ఎడ్యుకేటెడ్ అంటూ తెగ పొగిడేసారు భరత్. అంతటితో ఆగకుండా కూటమి పార్టీల్లోని 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీల్లో స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఏకైక నేత నారా లోకేష్ గా అభివర్ణించారు. ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా.. ఎవరికి ఇష్టం లేకపోయినా లోకేష్ బెస్ట్ సీఎం అవుతారని తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. అయితే ఆ మాటే ఇప్పుడు కూటమిలో తూటాలను పేల్చుతోంది. కూటమిలో విభేదాలకు కారణం అవుతోంది.
* టిడిపి నేతలు వరస పెట్టి ప్రకటనలు
గత కొంతకాలంగా లోకేష్ కు( Nara Lokesh ) ప్రభుత్వంలో ప్రమోట్ చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి.. అందులోనూ లోకేష్ టీం నేతలుగా ముద్ర పడిన వారే ఈ తరహా డిమాండ్ చేయడం ప్రారంభించారు. మహాసేన రాజేష్ గురించి అందరికీ తెలిసిందే. లోకేష్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన. పైగా జనసేనకు వ్యతిరేకంగా ఇటీవల మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యే హోదా లోకేష్ ఉందని తేల్చి చెప్పారు. రెడ్డప్ప గారి శ్రీనివాసుల రెడ్డి, బుద్ధ వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు.. ఇలా అందరి స్లోగన్ అదే అయ్యింది. అది సహజంగానే జనసైనికులకు మండించే అంశం. చంద్రబాబు తర్వాత అంతటి గౌరవం పవన్ పొందాలి అన్నది వారి అభిప్రాయం. పవన్ ఏకైక డిప్యూటీ సీఎం ఉండాలన్నది వారి అభిమతం. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా పవన్ తో పాటు లోకేష్ కు సమప్రాధాన్యం ఇవ్వడం వారికి ఇష్టం లేదు. అందుకే వారి నుంచి అభ్యంతరాలు ప్రారంభం అయ్యాయి.
* మంత్రి భరత్ ప్రకటనతో
అయితే దావోస్( davos ) పారిశ్రామిక సదస్సుకు వెళ్లిన టీజీ భరత్ సందర్భం లేని మాటలు ఆడారు. ఏకంగా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. అంతటితో ఆగకుండా కూటమి పార్టీల్లో లోకేష్ లాంటి నేత లేరని చెప్పుకొచ్చారు. అప్పటికే మంటతో ఉన్న జన సైనికులకు ఇది మరింత కాకరేపింది. మరోవైపు మంట మండించేందుకు వైసిపి సిద్ధంగా ఉంది. దీంతో శరవేగంగా మంటలు అందుకున్నాయి. లోకేష్ అంశం ఇప్పుడు కూటమిలో అగ్నికి ఆజ్యం పోసింది. దీంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది తెలుగుదేశం పార్టీ. ఇకనుంచి ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. అయితే ఇలా ప్రకటన చేసినా.. దీని వెనుక టిడిపి వ్యూహం ఉందన్నది జనసేన అనుమానం. ఒక విధంగా చెప్పాలంటే ఆ రెండు పార్టీల మధ్య చిన్నపాటి గ్యాప్ ప్రారంభం అయినట్టే.
* జనసేన నాయకుడి ప్రకటనతో
సందట్లో సడే మియా అన్నట్టు తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్( Kiran rayal ) కీలక ప్రకటన చేశారు. తెలుగుదేశం శ్రేణులకు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఉన్నట్టే.. జనసేన శ్రేణులకు సైతం ఈ రాష్ట్రానికి పవన్ సీఎం కావాలని ఉందని చెప్పుకొచ్చారు. దీంతో మంట పతాక స్థాయికి చేరుకుంది. వెంటనే తెలుగుదేశం పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. మూడు పార్టీల ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో ప్రారంభంలోనే కీలక ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు ఉంటారు. ఏకైక డిప్యూటీ సీఎం గా పవన్ ఉంటారు. పవన్ గౌరవాన్ని నిలబెట్టుకునేలా ఈ ఒప్పందం జరిగింది. అయితే ఇప్పుడు లోకేష్ ను మరింత ప్రమోట్ చేయాలని టిడిపి శ్రేణులు కోరుతున్నాయి. అయితే దీని వెనుక టిడిపి వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే కూటమిలో విభేదాలు ప్రారంభమవుతాయని ఆందోళన చెందుతున్న టిడిపి ప్రత్యేక ప్రకటన చేయాల్సి వచ్చింది.