Telugu States Politics: తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన రాజకీయ పరిస్థితి ఉంది. ఎవరికి ఎవరు మిత్రులో.. ఎవరు శత్రువులో తెలియడం లేదు. ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. తెలంగాణలో ఇండియా కూటమికి నేతృత్వం వహించే కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న గులాబీ పార్టీకి మంచి స్నేహితురాలు. అదే తెలంగాణలోని కాంగ్రెస్ మంత్రులు ఏపీలోని వైయస్సార్సీపి నేతలకు సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి కేసిఆర్ తో స్నేహం చేస్తే.. వైసీపీ నేతలు మాత్రం కాంగ్రెస్ మంత్రులతో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా విచిత్ర రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో.
నేతలు తిరుపతి వస్తే..
ఏపీ సీఎం చంద్రబాబుకు( AP CM Chandrababu) అత్యంత సన్నిహితుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అయితే దాని వెనుక చంద్రబాబు ప్రోత్సాహం ఉందన్నది రేవంత్ ప్రత్యర్థులు చేసే ఆరోపణ. అటువంటి రేవంత్ రెడ్డితో చంద్రబాబు చాలా సందర్భాల్లో సన్నిహితులుగా ఉండడం కనిపించింది. రేవంత్ రెడ్డి సైతం చంద్రబాబు విషయంలో గౌరవమైన ప్రకటనలే చేస్తూ వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట తిరుమల దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో రాష్ట్ర మంత్రులుగా ఉన్న పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చెనాయుడు తో పాటు స్థానిక శాసనసభ్యులు ఘనస్వాగతం పలికారు. అక్కడకు ఒక్కరోజు తరువాత తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తిరుమల దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఇలా విచిత్ర పరిస్థితులు కొనసాగుతున్నాయి.
చంద్రబాబు వెనుక రేవంత్?
సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశారు రేవంత్ రెడ్డి( Revanth Reddy ). జడ్పిటిసి స్థాయి నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. కానీ కెసిఆర్ కొట్టిన దెబ్బకు తెలంగాణలో టిడిపి నాశనం అయ్యింది. చంద్రబాబుకు బలమైన మద్దతుదారుగా నిలిచిన రేవంత్ రెడ్డిని సైతం ఇబ్బంది పెట్టారు కెసిఆర్.. అయితే టిడిపిలో ఉంటే కెసిఆర్ ను ఏమీ చేయలేమని భావించిన రేవంత్ కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందకపోగా రోజురోజుకు డ్యామేజ్ దిశగా సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మారారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు చంద్రబాబు సహకారం తీసుకున్నారు అన్నది ఒక వాదన. అయితే తన చరిష్మతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు రేవంత్. అయితే రేవంత్ సైతం సీఎంగా మారిన తర్వాత కూడా చంద్రబాబు విషయంలో సానుకూలంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన క్యాబినెట్ లోని మంత్రులు మాత్రం వైఎస్సార్సీపీతో స్నేహం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే పూర్వాశ్రమంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పని చేసిన నేతలు కాబట్టి.
పరస్పర విరుద్ధ స్నేహాలు..
తెలంగాణలో( Telangana) గులాబీ పార్టీతో పోరాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. అదే గులాబీ పార్టీ బాస్ తో స్నేహం చేస్తున్నారు ఏపీలోని వైసీపీ అధినేత జగన్. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డిని సైతం కాంగ్రెస్ మంత్రులు వ్యతిరేకించాలి. కానీ వారు ఆ పని చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలతో స్నేహం కొనసాగిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎన్డీఏ పక్ష సీఎం గా ఉన్న చంద్రబాబుతో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. చంద్రబాబుతో పాటు రేవంత్ రెడ్డి ఉమ్మడి శత్రువు కెసిఆర్. జగన్ తో పాటు కేసీఆర్ ఉమ్మడి శత్రువు చంద్రబాబు. ఇలా కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది తెలుగు రాజకీయాల్లో. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల సమూహాలు ఉంటే పరిస్థితి ఇలానే ఉంటుంది.