IMD Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అప్డేట్. వేసవితో మండిపోతున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాలు. ఇటువంటి తరుణంలో చల్లటి వార్త ఒకటి వచ్చింది. రానున్న ఐదు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ నుంచి చల్లటి కబురు అందింది. ఆస్ట్రేలియా వైపు మైలా, వలను అనే రెండు తుఫాన్లు ఏర్పడ్డాయి. మరోవైపు హిందూ మహాసముద్రంలో ఇందుసా అనే వాయుగుండం కొనసాగుతోంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజులపాటు వాతావరణంలో మార్పులు చేసుకుంటున్నాయి. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణీ కొనసాగుతోంది.. దీని ప్రభావంతో వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీవ్యాప్తంగా అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు సంభవిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మందస మండలం కేసు పురం గ్రామంలో తల్లి కూతుళ్లు చనిపోయారు.
- గత రెండు రోజులుగా చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలు పడ్డాయి. సోమవారం ఉదయం నుంచి గోదావరి, తిరుమల, చిత్తూరులో వర్షాలు పడ్డాయి. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు వచ్చాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి.
- ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
- మరోవైపు రాయలసీమలో ఎండల ప్రభావం కొనసాగుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.
- ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సైతం స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఖమ్మం పరిసర ప్రాంతాలకు వర్ష సూచన ఉంది.
- దక్షిణ తెలంగాణతో పాటు హైదరాబాదులో ఎండల తీవ్రత కొనసాగుతుంది.