Film Industry In AP: ఏపీకి( Andhra Pradesh) సినీ పరిశ్రమ తరలి వస్తుందా? ఆ ఛాన్స్ ఉందా? ప్రభుత్వం ఆహ్వానిస్తున్నా సినీ పరిశ్రమ ఎందుకు రావడం లేదు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఏపీలో పాలన కోలుకునేందుకు రెండు సంవత్సరాల సమయం పట్టింది. పాలన గాడిలో పడుతుందన్న క్రమంలో అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. ఇతరత్రా మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ధి పై చంద్రబాబు దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇంతలోనే ఐదేళ్ల పాలన కరిగిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సినీ పరిశ్రమను విశాఖకు రప్పించేందుకు తగిన ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతోంది. సినీ పరిశ్రమ నుంచి సానుకూలతలు రావడం లేదు.
Also Read: రవితేజ వల్లే మా తమ్ముడు కార్తీ కెరియర్ నిలబడింది : సూర్య…
* బంగారు బాతు గుడ్డుగా..
ఉద్యమ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమను విపరీతంగా ద్వేషించారు కేసీఆర్( KCR). కానీ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ పరిశ్రమ అనేది ప్రభుత్వానికి బాతు గుడ్డు అని గ్రహించారు. సినీ పరిశ్రమ పెద్దలతో సఖ్యత పెంచుకున్నారు. వారికి చాలా రకాల ప్రయోజనాలు, రాయితీలు కల్పించారు. దీంతో సినీ పరిశ్రమ ఏపీ వైపు చూడడం మానేసింది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సినీ పరిశ్రమను ఏపీకి రప్పించే ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు తాజాగా రేవంత్ సర్కార్ సైతం చిత్ర పరిశ్రమతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీంతో చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉండేందుకు ఇష్టపడుతోంది. ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
* విశాఖ అనువైన ప్రాంతం..
ఏపీకి సంబంధించి చిత్ర పరిశ్రమకు విశాఖ( Visakhapatnam) అనువైన ప్రాంతం. కానీ సినీ పరిశ్రమ ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి కనబరచడం లేదు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏపీలో వ్యాపారం కావాలి.. కానీ ఇక్కడకు వచ్చేందుకు ఇష్టపడకపోవడం మాత్రం ఏపీ ప్రజల దురదృష్టకరం. చిత్ర పరిశ్రమ విశాఖకు వస్తే ఈ ప్రాంతీయులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వతహాగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరో. ఇంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబును కలవకపోవడంపై మొన్న ఆ మధ్యన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో నాటి పరిస్థితులపై బాలకృష్ణ స్పందించడం.. అది వివాదాలకు దారి తీయడం తెలిసిందే. అయినా సరే ఎటువంటి దిద్దుబాటు చర్యలు కనిపించడం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే తెలంగాణ అన్నట్టు ఉంది. ఏపీలో వ్యాపారం.. తెలంగాణకు ఆదాయం అన్నట్టు మారుతోంది సినీ పరిశ్రమ వ్యవహారం. ఎప్పటికైనా ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏపీకి రప్పించే ఏర్పాట్లు చేస్తుందా? లేదా? అన్నది చూడాలి.