Telugu Desam Party: తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) చాలామంది వారసులు తెరపైకి వచ్చారు. కానీ సక్సెస్ అయ్యింది కొందరు మాత్రమే. నారా లోకేష్ వారసత్వంగా వచ్చినా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి పార్టీతో పాటు ప్రభుత్వంలో తన పట్టు పెంచుకున్నారు. అయితే లోకేష్ కంటే మించి అన్నట్టు మరో వారసుడు దూసుకుపోతున్నారు. ఆయనే కింజరాపు రామ్మోహన్ నాయుడు. స్వర్గీయ కింజరాపు ఎర్రం నాయుడు కుమారుడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు ఎర్రం నాయుడు. చంద్రబాబుకు కుడి భుజం లా మారారు. ఆయన అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు.
Also Read : తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రికి వల్లభనేని వంశీ..!
* టిడిపి నాయకుల ఫ్యాక్టరీ..
తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అంటూ చంద్రబాబు ( CM Chandrababu) తరచూ చెబుతుంటారు. ఇది ముమ్మాటికి సత్యం. తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలక రాజకీయాలు చేసిన నేతలంతా తెలుగుదేశం పార్టీలో రాజకీయ అభ్యాసం చేసిన వారే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు టిడిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వారే. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం టిడిపిలో సుదీర్ఘకాలం ఉండేవారు. వందలాదిమంది నేతలను తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలా వచ్చిన వారే ఎర్రం నాయుడు. జాతీయ స్థాయిలో సైతం ఎర్రం నాయుడు ను నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం. టిడిపి అభివృద్ధిలో ఎర్రం నాయుడు పాత్ర ఎనలేనిది. ఆయన అకాల మరణంతో ఆ స్థాయిలో అండ చంద్రబాబుకు ఉండదని అంతా భావించారు. కానీ ఎర్రన్న వారసుడు రామ్మోహన్ నాయుడు రూపంలో ఇప్పుడు బలమైన నాయకుడు దొరికాడు తెలుగుదేశం పార్టీకి. అన్నిటికీ మించి రామ్మోహన్ నాయుడు చంద్రబాబుతో పాటు లోకేష్ కు అండగా నిలబడుతుండడం విశేషం.
* చిన్న వయసులోనే పార్లమెంటుకు..
సరిగ్గా మూడు పదులు దాటని రామ్మోహన్ నాయుడు( Ram Mohan Naidu ) 2014లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. పార్లమెంట్లో అడుగుపెట్టారు. తన వాగ్దాటితో అందర్నీ ఆకట్టుకున్నారు. 2019లో జగన్ ప్రభంజనాన్ని సైతం పట్టుకొని నిలబడ్డారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి రెండోసారి గెలిచారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు ఓడిపోయారు. కానీ రామ్మోహన్ నాయుడు లోక్ సభకు ఎన్నిక కావడం మాత్రం ఒకసారి కొత్త రికార్డ్. 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. క్యాబినెట్లో విన్నవయస్కుడిగా జాతీయస్థాయిలో గుర్తింపు సాధించారు.
* అమరావతి సభలో ప్రాధాన్యం..
చంద్రబాబు తర్వాత లోకేష్( Lokesh). ఇది అందరికీ కనిపిస్తున్న సత్యం. కానీ లోకేష్ తరువాత ఎవరు అంటే మాత్రం అందరి చూపు రామ్మోహన్ నాయుడు వైపే ఉంది. మొన్న అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే సభా వేదికపై కేవలం కొద్ది మందికి మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు. మంత్రులు నారాయణ, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ క్రమంలో కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడుకు ఆ అవకాశం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ మాటలను తెలుగులో తర్జుమా చేయడం కూడా రామ్మోహన్ నాయుడు చేశారు. రామ్మోహన్ నాయుడుకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భవిష్యత్ సంకేతాలు ఇస్తున్నారు. లోకేష్ తరువాత ఎవరూ అంటే ముమ్మాటికి రామ్మోహన్ నాయుడు అనేలా సంకేతాలు పంపారు. మున్ముందు తెలుగుదేశం పార్టీలో రామ్మోహన్ నాయుడు పాత్ర పెరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.