Telugu states: తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో వడగాల్పులు ఉంటే.. మరికొన్ని జిల్లాల్లో వర్షం పడుతుంది. రోజంతా 40 డిగ్రీలకు దాటిన ఉష్ణోగ్రతలు ఉంటే.. సాయంత్రానికి వర్షాలు కురిసి ఉపశమనం దక్కుతోంది. మరో రెండు రోజులపాటు పరిస్థితి ఇలానే ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. కొన్ని జిల్లాల్లో మరో రెండు రోజుల్లో పిడుగులు, ఈదురు గాలులతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ఏడాది ముందుగానే ఎండల ప్రభావం ప్రారంభం అయింది. సంక్రాంతి తర్వాత విపరీతంగా ఎండలు మండుతూ వచ్చాయి. అయితే మార్చిలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో చల్లటి వాతావరణం కొనసాగింది. కానీ ఏప్రిల్ లో ప్రవేశించిన నాటి నుంచి ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి.
మూడు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మధ్యాహ్ననికి కొన్ని ప్రాంతాల్లో బయట తిరగాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వడగల్పులు కారణంగా మనుషులపై ప్రభావం కనిపిస్తోంది. చాలా చోట్ల అస్వస్థతకు కూడా గురవుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతుండడం ఉపశమనం కలిగించే విషయం. ప్రధానంగా తెలంగాణలో వర్షాల ప్రభావం అధికంగా ఉంటుంది. శనివారం నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులు పడనున్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Also Read: జగన్ ‘మావిగన్’ స్క్రిప్ట్ రాసిచ్చిందెవరు
ఏపీలో భిన్నం..
ఏపీలో మాత్రం భిన్న వాతావరణం కొనసాగనుందని స్పష్టమవుతోంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో వడగాలులు కూడా విస్తాయి. శనివారం 73 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు.. ఆదివారం 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీస్తాయని తాజాగా వెల్లడించారు. మరోవైపు ఉత్తరాంధ్రలో ఆకాశం మేఘావృతం అయి వర్షాలు పడుతున్నాయి. ఒకవైపు ఎండల తీవ్రత కొనసాగుతూనే.. సాయంత్రానికి వర్షాలు పడుతున్నాయి.
