Telangana leaders comments on Pawan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై( AP deputy CM Pawan Kalyan ) తెలంగాణ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ పై వ్యాఖ్యలు చేస్తారా? అంటూ విరుచుకుపడుతున్నారు. అయితే ఈ విషయంలో స్వరాష్ట్రంపై అభిమానం కంటే.. పక్క రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గ అభిమానం మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. పవన్ పై బిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందేమో అని పవన్ వాక్యానించడమే వారికి తప్పుగా కనిపించింది. ఆ తప్పును ఖండించాల్సింది పోయి తమ కడుపులో ఉన్న మంటను మాత్రం వారు బయట పెట్టేస్తున్నారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న తెలంగాణ నేతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పరస్పర ప్రయోజనాలు..
తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. అయితే ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఉండేటప్పుడు.. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉండేవారు. వీరిద్దరూ స్నేహితులు. అయితే తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం నేతలను కెసిఆర్ తొక్కి పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఆ కారణం చేతనే రెడ్డి సామాజిక వర్గం అంతా కాంగ్రెస్ పార్టీ నీడలోకి వచ్చి కెసిఆర్ ను ఓడించింది. ఏపీలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కాపు సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణంగా దెబ్బతీసింది. చంద్రబాబుతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా దెబ్బతీశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడాన్ని తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతున్నట్లు అర్థమవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.
అనుకోకుండా కామెంట్స్..
మొన్న అంబేద్కర్ కోనసీమ( Ambedkar konasima ) జిల్లా పర్యటనకు వెళ్లారు పవన్ కళ్యాణ్. ఉప్పు నిర్మూలంగా అక్కడి కొబ్బరి పంట దారుణంగా దెబ్బతింటుంది. అక్కడ రైతుల విజ్ఞప్తి మేరకు ఆ ప్రాంతంలో పర్యటించారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి రాష్ట్రంలోనే కోనసీమ అంటే ఆకట్టుకునే ప్రాంతం. అటువంటి ప్రాంతం తమ రాష్ట్రంలో లేదు అని తెలంగాణ వాసులు బాధపడుతుంటారు. దానిని గుర్తుచేసుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణ దిష్టి తగిలిందేమోనని వ్యాఖ్యానించారు. దానిని పట్టుకొని సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించాలని చూసింది కేసీఆర్ పార్టీ. ఆ పార్టీకి చెందిన జగదీశ్వర్ రెడ్డి రంగంలోకి దిగారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బుర్ర లేదు అన్నట్టు మాట్లాడారు. ఆ పదవికి అనర్హుడు అన్నట్టు వ్యాఖ్యానించారు. ఇంకోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అయితే ఒంటరిగా గెలవలేడు కానీ అన్నట్టు మాట్లాడారు. ఒంటరి పోరాటం అన్నమాట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది. ఆ మాట కాంగ్రెస్ ఎమ్మెల్యే నోట రావడం ఎందుకో కొత్త చర్చకు దారితీసింది. పైగా రెడ్డి సామాజిక వర్గం నేతలే ప్రత్యేకంగా ఇప్పుడు రంగంలోకి దిగడం చూస్తుంటే.. ఏపీలో జగన్మోహన్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓటమికి పవన్ కారణం అని బాధపడేలా ఉంది.
విభిన్న కుల రాజకీయాలు..
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర కుల రాజకీయాలు నడుస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం కలిసింది. అదే తెలంగాణలో మాత్రం రెడ్డి సామాజిక వర్గంతో కాపు సామాజిక వర్గం కలిసింది. అవసరాలరీత్యా కమ్మ సామాజిక వర్గం సైతం కాంగ్రెస్ పార్టీకి జై కొట్టింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే ఆయనను వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు సన్నిహితుడు కాబట్టి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే తన ప్రత్యర్థి కేసీఆర్ కు సన్నిహితుడు కాబట్టి. ఈ విషయాలను పక్కన పెడితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకం అయ్యారు. ఎందుకంటే కాపు సామాజిక వర్గంతో పాటు కమ్మ సామాజిక వర్గాన్ని కలిపి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి దించారు. అందులో భాగమే తెలంగాణ రెడ్డి సామాజిక వర్గ నేతల కామెంట్స్ అని తెలుస్తోంది.