TDP vs YCP : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ప్రతిపక్షం( opposition) విధి. ప్రజా సమస్యలపై పోరాటం కూడా ప్రధాన కర్తవ్యం. అటువంటి పోరాటాలకు సిద్ధమవుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. అయితే ఇదే వైసీపీ మొన్నటి వరకు పాలకపక్షం అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. గత ఐదేళ్ల పాటు నిర్వాకాలే ఈ పరిస్థితికి కారణమని సమీక్షించుకోవాలి. కానీ అది గుర్తించుకోకుండా పోరాటాలకు సిద్ధమవుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈనెల ఐదున ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫీజు పోరు పేరిట ఆందోళనలకు పిలుపునిచ్చింది వైసిపి. కానీ ఇవన్నీ తమ హయాంలో పెండింగ్ లో ఉంచిన బకాయిలేనన్న విషయాన్ని మరిచిపోయారు వైసీపీ నేతలు. అసలు పార్టీలో ఉంటారా? ఉండరా? అని అనుమానించే నేతలు ఫీజు పోరు పోస్టర్ను ఆవిష్కరించడం ఆశ్చర్యం వేస్తోంది. అయితే అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ ఈ సందర్భంగా నేతలు మాట్లాడిన తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* అన్ని ప్రభుత్వాలు కొనసాగించాయి
వాస్తవానికి ఫీజు రీయింబర్స్ మెంట్ ( fees reimbursement ) పథకాన్ని ప్రవేశపెట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి. దానిని అలానే కొనసాగించారు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు. అటు తర్వాత వచ్చిన చంద్రబాబు సైతం ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయగలిగారు. ఎటువంటి ఆర్భాటం చేయకుండా పేద విద్యార్థులకు, వారి చదువుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఈ పథకాన్ని విద్యా దీవెనగా మార్చారు. కానీ ఈ పథకం ప్రారంభించిన విధంగా బిల్డప్ ఇచ్చారు. పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ కింద బిల్లులు చెల్లించారు. అప్పట్లో నేరుగా కాలేజీలకే ప్రభుత్వం నిధులు చెల్లించేది. ఆ విధానాన్ని సైతం మార్చేశారు జగన్. ఈ ఐదేళ్లలో రెండు మూడు సార్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. జగన్ మాటలను నమ్మి కార్పొరేట్ కాలేజీల్లో పిల్లలను చేర్చి నష్టపోయారు తల్లిదండ్రులు. తమను జగన్ దారుణంగా దెబ్బతీశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు అధికారం నుంచి దిగేముందు కూడా బటన్ నొక్కాడు జగన్. కానీ ఫీజు రీయింబర్స్ మెంట్ మాత్రం రాలేదు.
* ప్రచారం ఎక్కువ ఫలితం తక్కువ
వాస్తవానికి గత ఐదేళ్లలో ప్రచారం ఎక్కువగా జరిగింది. పథకం అమలు మాత్రం అంతంత మాత్రమే. 2014 నుంచి 2019 మధ్య టిడిపి ప్రభుత్వం ఉండేది. ఏటా ఫీజు రీయింబర్స్ మెంట్ కింద 16 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం జరిగేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు. పోనీ ఫీజు రీయింబర్స్ మెంట్ అనేది విడతలవారీగా చెల్లించేది. అందులో కూడా ఏడు లక్షల మంది విద్యార్థులకు మోసం జరిగినట్లు బాధితులే చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది విద్యార్థులు మధ్యలోనే చదువు నిలిపేయాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో అయితే ఓ యువతి కళాశాలకు ఫీజు చెల్లించలేక.. తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించింది అంటే పరిస్థితి ఏ స్థాయికి తీసుకొచ్చారు అర్థం అవుతోంది.
* రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి
అయితే ఒక్క శ్రీకాకుళం లోనే కాదు..చాలా చోట్ల జగన్ సర్కార్ మాటలను నమ్మి కళాశాలల్లో చేరిన చాలామంది విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కాకపోవడంతో విజయవాడలోని ఓ కాలేజీ విద్యార్థికి నోటీసు ఇచ్చింది. 60 వేల రూపాయల ఫీజు కడితేనే పరీక్షలు రాయిస్తామని తేల్చి చెప్పింది. ఇది నిజం కాదా? చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రముఖ కాలేజీ నుంచి ఓ విద్యార్థికి నోటీసు వచ్చింది. 2019 విద్యా సంవత్సరంలో 57 వేల ఫీజు పెండింగ్ లో ఉందని.. తక్షణం కట్టాలని.. లేకుంటే మాత్రం చర్యలు తప్పవని ఆ నోటీసులో పేర్కొన్నారు. 2023లో నెల్లూరు జిల్లా కావలిలో ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లించలేదని చెబుతూ ఓ 30 మంది నర్సింగ్ విద్యార్థులను కళాశాల యాజమాన్యం బయటకు పంపించింది. అయితే ఇది వెలుగులోకి వచ్చిన ఘటనలు మాత్రమే. వెలుగులోకి రాని ఘటనలు చాలా ఉన్నాయి.
* ఆ పెండింగ్ అంతా వైసిపి హయాంలోనిదే
ఇప్పుడు వైసీపీ ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రోడ్ ఎక్కడం ఆహ్వానించదగ్గదే. కానీ ఆ ఫీజుల పెండింగ్ అన్నది జగన్ సర్కార్ హయాంలోనే అన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఫీజు రీయింబర్స్ మెంట్ కింద రూ.2832 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ. 989 కోట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫీజు రీయింబర్స్ మెంట్ కింద రూ.450 కోట్లు పెండింగ్లో పెట్టింది. కేవలం ఐదేళ్లపాటు అంకెల గారడీతో సాక్షితో పాటు అనుకూల మీడియాలో ప్రకటనలు ఇచ్చుకున్నారు జగన్. ఎలాంటి అవాంతరాలు లేకుండా కాలేజీలకు నేరుగా ఫీజులు చెల్లించేవి గత ప్రభుత్వాలు. కానీ తన స్వార్థం కోసం ఆ విధానాన్ని మార్చారు జగన్. విడతల వారీగా చెల్లింపులు అని చెప్పి పేద తల్లిదండ్రులలో ఆశలు రేపారు. వారి ఆశలను మధ్యలోనే చిదిమేశారు.
* ప్రత్యేక ఫోకస్ పెట్టిన ప్రభుత్వం
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై దృష్టి పెట్టింది. ఫీజులు చెల్లించలేదని కారణం చెబుతూ చాలామంది విద్యార్థులకు సంబంధిత యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకొని 10 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. విడతలవారీగా బకాయిలు విడుదల చేస్తోంది కూటమి ప్రభుత్వం. మొన్నటికి మొన్న ముస్లిం, మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేసింది. విడతలవారీగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఫీజు పోరు పేరుతో కొత్త నాటకానికి తెర తీసే ప్రయత్నం చేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ పార్టీ ప్రయత్నాలను విద్యార్థుల తల్లిదండ్రులు గమనించారు. మొన్నటి వరకు ఉన్నది మీరే కదా? మీరు పెట్టిన పెండింగ్ బిల్లులే కదా? అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు.