TDP Vs YCP: వైసిపి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. ఒక్క తాడిపత్రి మినహా మొత్తం మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు వైసిపి వశమయ్యాయి. అప్పట్లో వైసీపీ చేసిన అరాచకాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. తర్వాత వచ్చిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను బహిష్కరించారు. కనీసం టిడిపికి జిల్లా పరిషత్ లో ప్రాతినిధ్యం లేదు. మున్సిపాలిటీల్లో కూడా చోటు లేకుండా పోయింది. ఆ సమయంలోనే టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. 2024 ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఉంటుందా? అన్న అనుమానాలు కలిగాయి. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది.
* అధికార పార్టీకి జై
సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి స్థానిక సంస్థల ప్రతినిధులు జై కొడతారు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగింది అదే. అప్పట్లో మున్సిపాలిటీల్లో బోణి కొట్టని టిడిపికి ఇప్పుడు జై కొడుతున్నారు వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. దీంతో ఒక్కొక్కటి తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరింది. మొత్తం పది చోట్ల ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఏడు చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగాయి. హిందూపురం, పాలకొండ లో చైర్మన్ పోస్టులు.. బుచ్చిరెడ్డిపాలెం, తుని, పిడుగురాళ్ల, ఏలూరు, నూజివీడులో వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది టిడిపి. మూడు చోట్ల కోరం లేకపోవడంతో రేపటికి ఎన్నికలు వాయిదా పడ్డాయి.
* ఏలూరులో రెండు డిప్యూటీ మేయర్ పదవులు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. 50 మంది కార్పొరేటర్లకు గాను 30 మంది హాజరయ్యారు. పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని లను డిప్యూటీ మేయర్లుగా ఎన్నుకున్నారు.
* హిందూపురం మున్సిపల్ పీఠాన్ని టిడిపి కైవసం చేసుకుంది. చైర్మన్గా రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయనకు అనుకూలంగా 23 ఓట్లు పడ్డాయి. వైసిపి అభ్యర్థికి 14 ఓట్లు పడ్డాయి.
* నెల్లూరు డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎన్నికయ్యారు. ఆమెకు మద్దతుగా 41 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి కరీముల్లా కు కేవలం 12 ఓట్లు మాత్రమే దక్కాయి.
* నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ వైస్ చైర్మన్ గా టిడిపి మద్దతుదారులు గెలిచారు. తుని, నూజివీడు, పిడుగురాళ్ల వైస్ చైర్మన్ పోస్టులు కూడా టిడిపి ఖాతాలోనే పడ్డాయి. మొత్తానికైతే గతంలో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కిన చోట్ల కూడా సీన్ రివర్స్ కావడం గమనార్హం.