Nellore YCP: నెల్లూరు( Nellore) జిల్లాలో వైసీపీ దారుణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ జిల్లా అండదండగా నిలుస్తూ వచ్చింది. కానీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. పదికి పది అసెంబ్లీ సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఆ జిల్లాను అంచనా వేయడంలో జగన్ ఫెయిలయ్యారు. చేజేతులా నేతలను వదులుకున్నారు. చాలామంది విధేయత కలిగిన నాయకులను సైతం నిర్లక్ష్యం చేశారు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలకు ప్రోత్సాహం ఇచ్చి.. తాను అంటే అభిమానించే నేతలను దూరం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా నెల్లూరు కార్పొరేషన్ లో సైతం టిడిపి ప్రవేశించింది. డిప్యూటీ మేయర్ పోస్టును దక్కించుకుంది. దీంతో వైసిపికి ఉన్న ఆ చిన్నపాటి బలాన్ని కూడా లాగేసుకుంది టిడిపి. దీంతో వైసిపి పని జిల్లాలో అయిపోయినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* అనిల్ కుమార్ యాదవ్ తీరుతో
నెల్లూరు వైసిపి( YSR Congress ) అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. పార్టీకి ఒక మూల స్తంభంగా పనిచేశారు. అటువంటి నేత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దానికి కారణం మాత్రం అనిల్ కుమార్ యాదవ్. జగన్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కేసరికి అనిల్ యాదవ్ ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నేతలను నిర్లక్ష్యం చేశారు. వారిపై దూకుడుగా వ్యవహరించేవారు. అయితే జిల్లా పెద్దగా ఉన్న వేమిరెడ్డి విషయంలో సైతం అనిల్ ఓవర్ యాక్షన్ చేశారు. దానిని నియంత్రించకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం అందించేలా వ్యవహరించారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అగౌరవంగా భావించారు. గౌరవాన్ని వెతుక్కుంటూ టిడిపిలోకి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ వైసీపీ నుంచి భారీగా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తీసుకెళ్లిపోయారు.
* జగన్ నిర్లక్ష్యంతో
కేవలం జగన్( Jagan Mohan Reddy) నిర్లక్ష్యం చేయడం వల్లే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు పార్టీకి దూరమయ్యారు. కొందరు నాయకుల వ్యవహార శైలి తోనే వారు నెల్లూరు జిల్లాలో వేరే కుంపటి పెట్టుకున్నారు. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ తీరుతో ఎక్కువ మంది నిరుత్సాహానికి గురయ్యారు. అదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డికి చెప్పిన ఆయన పెద్దగా వినలేదు. పైగా అనిల్ కుమార్ యాదవ్ కు ప్రమోట్ చేస్తూ వచ్చారు. దీనినే ఎక్కువ మంది వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరారు. చివరకు స్వయానా బాబాయి అయిన రూపేష్ కుమార్ యాదవ్ కూడా అనిల్ కుమార్ యాదవ్ తీరుపై అసంతృప్తికి గురయ్యారు. వీరంతా పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకోవడం వెనుక ముమ్మాటికీ జగన్ నిర్లక్ష్యమే కారణం.
* డిప్యూటీ మేయర్ గా టిడిపి నేత
నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణ( Minister Narayana) పట్టు బిగించారు. అటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం తనదైన రాజకీయం నడిపారు. అందుకే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి టిడిపి దక్కించుకుంది. డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎన్నికయ్యారు. వాస్తవానికి నెల్లూరు కార్పొరేషన్ లో వైసీపీకి ఏకపక్ష బలం ఉంది. కానీ ఈరోజు డిప్యూటీ మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి తహసీన్ కు 41 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి 21 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. దీంతో వైసిపి పూర్తిగా ఇక్కడ డీలా పడిపోయింది.