Teenmar Mallanna Allegations Against Sajjanar: ఐ బొమ్మ రవి వ్యవహారం రోజురోజుకు కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది . పట్టుకున్న తర్వాత పోలీస్ కమిషనర్ సజ్జనార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలను వెల్లడించారు. ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అనేక అక్రమాలకు పాల్పడ్డాడని.. తన సైట్ ద్వారా బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసి కోట్లకు కోట్లు కొల్లగొట్టాడని వివరించారు. ఐ బొమ్మ సైట్ లో సినిమాలు చూసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని.. ఐ బొమ్మకు సపోర్ట్ చేసే వారిని కూడా వదిలిపెట్టేది లేదని సజ్జనార్ హెచ్చరించారు.
పోలీసులు ఎప్పుడు కూడా బాధితులలో కలిసి విలేకరుల సమావేశం ఇంతవరకు నిర్వహించలేదు. పైగా ఒక వ్యక్తిని న్యాయ విచారణ జరగకుండా దోషి అని చెప్పడం కూడా పోలీస్ చరిత్రలో ఇంతవరకు జరగలేదు. సజ్జనార్ చేసిన పని పట్ల మెజారిటీ వర్గాలు విమర్శలు వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేరారు.. తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సజ్జనార్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “సజ్జనార్ వల్ల రవి అరెస్టు కాలేదు. సినిమా వాళ్ళు ఏమైనా సంసారులా? దోపిడి దొంగలను పక్కన కూర్చోబెట్టుకున్నావ్? అత్యాచార బాధితులతో అలా మాట్లాడతావా? థియేటర్లో పాప్ కార్న్ 300, వాటర్ బాటిల్ ₹100 అమ్ముతారా? ఇదేం దోపిడి? ఐ బొమ్మ రవి దమ్మున్నోడు.. సజ్జనార్ నీ జీవితం మొత్తం ఫేక్ ఎన్కౌంటర్ లే ” అంటూ తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఎండీ గా ఉన్నప్పుడు వాటర్ బాటిల్ కాంట్రాక్టు సజ్జనార్ తన బావమరిదికి కట్టబెట్టారని తీన్మార్ మల్లన్న పక్కన ఉన్న సుదర్శన్ ఆరోపించారు. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. వాస్తవానికి ఐ బొమ్మ రవిని పట్టుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. కొందరేమో రవి మంచి పని చేశాడని ప్రశంసిస్తుంటే.. మరికొందరేమో సినిమా రంగాన్ని పరాన్న జీవి లాగా దోచుకున్న రవికి సరైన శిక్ష పడిందని పేర్కొంటున్నారు. అయితే తీన్మార్ మల్లన్న మాత్రం రవికి సపోర్ట్ చేయడం విశేషం. అంతేకాదు సజ్జనార్ తీరు పట్ల.. చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రవిని పట్టుకుంది సజ్జనార్ కాదని.. పోలీసులు చాలాకాలంగా కఠినమైన ఆపరేషన్ చేశారని.. చివరికి విజయం సాధించారని.. అయితే క్రెడిట్ మొత్తం సజ్జనార్ తీసుకున్నారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు.. రవికి అనుకూలంగా మీమ్స్ రూపొందిస్తేనే కేసులు పెడతామని హెచ్చరించిన సజ్జనార్.. తీన్మార్ మల్లన్న పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.