Teacher MLC Election: ఏపీలో మరో ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మొదలైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 9న కాకినాడలో కౌంటింగ్ జరగనుంది. సాధారణ ఎన్నికల మాదిరిగానే పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. చివరి నిమిషం వరకు అభ్యర్థులు ఉధృతంగా ప్రచారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పోటీలో చాలామంది ఉన్నా ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఉభయగోదావరి జిల్లాలోని 116 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. బ్యాలెట్ పద్ధతిలో ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్ లను కాకినాడలోని స్ట్రాంగ్ రూముకు తరలించనున్నారు. ఈనెల తొమ్మిదిన ఓట్ల లెక్కింపు నకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.
* ఎమ్మెల్సీ అకాల మరణంతో
ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. బ్యాలెట్ పత్రాలపై ప్రాధాన్యత క్రమంలో ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బొర్రా గోపి మూర్తి, గంధం నారాయణరావు, దీపక్, కవల నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి పోటీలో ఉన్నారు. వీరిలో గోపి మూర్తి, గంధం నారాయణ రావుల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఇప్పటికే వీరికి వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. ఎన్నికల్లో గోపి మూర్తి తొలిసారిగా బరిలో దిగారు. ఈయనకు యుటిఎఫ్ తో పాటు పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. గంధం నారాయణరావుకు ఎస్టియుతో పాటు మరి కొన్ని సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో ఇద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది.
* రాజకీయ పార్టీలు దూరంగా
అయితే ఇక్కడ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ పోటీ చేయలేదు. అనుబంధ విభాగాలు కూడా రంగంలోకి దిగలేదు. గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో ఇదే మాదిరిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగింది. కానీ తక్కువ మెజారిటీతో బయటపడింది. అప్పటి అనుభవంతో ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. అందుకే ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. విజేత ఎవరు అనేది ఈ నెల 9న తెలియనుంది.