SVBC Chairman Post : ఏపీలో నామినేటెడ్ పదవుల సందడి మరోసారి నెలకొంది. ఇప్పటికే రెండు విడతల జాబితాలను ప్రకటించారు. ఇప్పుడు మూడో జాబితా ప్రకటించేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో ఆశావహుల్లో ఒక రకమైన సందడి ప్రారంభం అయ్యింది. ఇప్పటికే టీటీడీ ట్రస్ట్ బోర్డును నియమించారు. ఇప్పుడు దానికి అనుబంధంగా ఉన్న ఎస్వీబీసీ, టీటీడీ ట్రైనింగ్ సెంటర్ పదవులు భర్తీపై దృష్టి పెట్టారు. ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి విపరీతమైన పోటీ ఉంది.గతంలో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఆ పదవిని అలంకరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ కు ఆ పదవి ఇచ్చారు జగన్. కానీ కొద్ది రోజులకే ఆయన వివాదాస్పదం అయ్యారు. దీంతో పదవి నుంచి వైదొలిగారు. అటు తరువాత ఓ మాజీ ఎమ్మెల్యే కు ఆ పదవి ఇచ్చారు జగన్. మూడేళ్ల పాటు ఆయన అదే పదవిలో కొనసాగారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఎస్వీబీసీ చైర్మన్ పోస్ట్ ఖాళీ అయింది. భర్తీ చేయవలసిన అనివార్య పరిస్థితి ఎదురైంది. దీంతో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
* సినిమా వారికి ఛాన్స్
అయితే ఈ పదవికి సినిమా వారు అయితే సరిపోతారని కూటమి సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే ఆలోచనతో రాఘవేంద్రరావుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి సినిమా వారికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినీ నిర్మాత అశ్విని దత్, మురళీమోహన్,రాజేంద్రప్రసాద్ వంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి అశ్విని దత్ తో పాటు మురళీమోహన్ లు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని ఆశించారు. కానీ అనూహ్యంగా బిఆర్ నాయుడుకు ఆ పదవి దక్కింది. 24 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు కొలువు తీరింది. అయితే టీటీడీ ట్రస్ట్ బోర్డు తర్వాత ఎస్ వి బి సి ఛానల్ చైర్మన్ పోస్టుకు విపరీతమైన క్రేజ్ ఉంది.
* ముగ్గురు మధ్య పోటీ
అయితే తాజాగా నటుడు రాజేంద్రప్రసాద్ చైర్మన్ బిఆర్ నాయుడు ను కలిశారు. రాజేంద్రప్రసాద్ సైతం టిడిపి సానుభూతిపరుడు. ఎన్టీఆర్ హయాం నుంచి అదే పార్టీని నమ్ముకున్నారు. మురళీమోహన్ తో పాటు అశ్వినీ దత్ ఎంపీలుగా పనిచేశారు. ఈ ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. అటు చైర్మన్గా వ్యవహరిస్తున్న బి.ఆర్ నాయుడు అదే సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో సామాజిక సమతూకం విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కాక తప్పవు. అందుకే ఈ ముగ్గురికి ఛాన్స్ లేదని తెలుస్తోంది.
* తెరపైకి త్రివిక్రమ్ శ్రీనివాస్
మరోవైపు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోస్టును జనసేన ఆశించింది. కానీ ఆ అవకాశం దక్కలేదు. అందుకే ఎస్వీబీసీ చైర్మన్ పోస్ట్ తమకు కేటాయించాలని జనసేన కోరినట్లు తెలుస్తోంది. ఆ పదవికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. జనసేన పార్టీ విస్తరణకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారన్న టాక్ ఉంది. ఇటీవల పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన వెంట ఉన్నారు. అప్పటినుంచి ఒక రకమైన ప్రచారం ఉంది. టీటీడీలో కీలకమైన పోస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇస్తారని టాక్ నడిచింది. అది ఎస్ వి బి సి చైర్మన్ పోస్ట్ అని తాజాగా అనుమానాలు నడుస్తున్నాయి. మరి ఆ పదవి ఎవరికి ఇస్తారో? ఎవరికి వరిస్తుందో? చూడాలి.