Vijaysai Reddy: కాకినాడ పోర్టు విషయంలో సిఐడి సంచలన నిర్ణయం తీసుకుంది.కాకినాడ పోర్టులో 3500 కోట్ల రూపాయల వాటాలకు యజమానిగా ఉన్న తనను బెదిరించి లాక్కున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు అలియాస్ కెవి రావు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఐడీ విచారణకు ఉపక్రమించింది. కట్టిన చర్యలు దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరో ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో అధినేత శరత్ చంద్రారెడ్డి తో పాటు మరికొందరికి సిఐడి లుకౌట్ నోటీసులు జారీచేసింది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ విషయంలో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు దేశం దాటిపోకుండా ఉండేందుకు సిఐడి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వీరి విషయంలో సిఐడి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అందరిలోనూ ఉత్కంఠ పెంచుతోంది.
* ఉమ్మడి ఏపీలో ఒప్పందం
ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్నారు కర్నాటి వెంకటేశ్వరరావు. ఆయన జిఎంఆర్ తో కలిసి పోర్టును అభివృద్ధి చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇబ్బందికర పరిస్థితులు ప్రారంభమయ్యాయి. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామన్న హెచ్చరికలతో.. భయంతో వాటాలను బదలాయించినట్లు కెవి రావు చెబుతున్నారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి తో పాటు విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి తమను బెదిరించినట్లు కెవి రావు సిఐడి కి ఫిర్యాదు చేశారు. అందుకే వీరిని విచారించాలని సిఐడి డిసైడ్ అయ్యింది. ఇంతలో వారు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది సిఐడి.
* కూటమి సర్కార్ సీరియస్
కాకినాడ పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు మీదుగా భారీ ఎత్తున రేషన్ బియ్యం తరలిపోతుండడంతో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పట్టుబడిన షిప్ వెనుక వైసిపి నేతల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏకంగా కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలు రావడం.. నేరుగా బాధితుడే ఫిర్యాదు చేయడంతో సంచలనం గా మారింది. ఇప్పటినుంచి మరింత దూకుడుగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే కాకినాడ పోర్టు వ్యవహారం ఇప్పుడు ఏపీని కుదిపేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.