TDPs solo political strategy: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు మిగతా రెండు పార్టీలకు సమన్వయంగా వెళుతూనే.. తనను తాను బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. కూటమి వరకు ఓకే కానీ.. ప్రభుత్వం అంటే టిడిపి అని అర్థం వచ్చేలా పావులు కదుపుతోందని అర్థం అవుతోంది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని ఈ నెల రెండు నుంచి నిర్వహిస్తున్నారు. అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలా చేపడుతున్నారు. జనసేనతో పాటు బిజెపి ప్రేక్షక పాత్రకు పరిమితం అవుతోంది. అయితే ఇది టిడిపి వ్యూహమా? లేకుంటే రెండు పార్టీల వైఫల్యమా? అన్నది తెలియాల్సి ఉంది. ఇది ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమం. అంటే మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకెళ్లాల్సిన కార్యక్రమం కానీ.. టిడిపి ఒక్కటి మాత్రమే చేస్తుండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
Also Read: వారి పింఛన్లు కట్.. కూటమి సర్కార్ షాక్!
టిడిపి సోలో ప్రయత్నం
మూడు పార్టీల మధ్య కూటమి ( Alliance ) వర్కౌట్ అయింది. మూడు పార్టీలు కలవడం వల్ల సునాయాస విజయం కాస్తా.. ఏకపక్ష విజయంగా మారిపోయింది. అయితే ఇప్పుడు పొత్తు వరకు ఓకే కాని ప్రభుత్వ పరంగా తామే అన్నట్టు టిడిపి వ్యవహరించడం మాత్రం ఇబ్బందికరంగా మారుతోంది. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదని మిగతా రెండు పార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఆ రెండు పార్టీల అవసరం ఏర్పడింది. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ రెండు పార్టీల అవసరం లేదన్నట్టు వ్యవహరిస్తుండడం ఏమిటని జనసైనికులు, కాషాయ దళం ప్రశ్నిస్తోంది. సాధారణంగా ఎవరికివారుగా బలపడుతూనే.. స్నేహితులుగా వెళ్లాలన్నది మూడు పార్టీల మధ్య ఉన్న ఒప్పందం. కానీ ఇప్పుడు టిడిపి ఒక్కటే తనకు తానుగా కార్యక్రమం జరుపుకుంటుంది. ప్రభుత్వానికి సంబంధించి సుపరిపాలనను తెలియజేప్పేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రెండు పార్టీలను విస్మరించి ఒక్క పార్టీ చేసుకోవడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది.
కనిపించని ఆ రెండు పార్టీల శ్రేణులు
ఈ కార్యక్రమంలో ఎక్కడా బిజెపి( BJP), జనసేన ప్రజాప్రతినిధులు కనిపించడం లేదు. సుపరిపాలనపై ప్రచారం చేసుకోవడానికి తమకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు తీరును ప్రశ్నిస్తున్నారు. ఆ రెండు పార్టీలతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మాదిరిగా ఆ రెండు పార్టీలు కార్యక్రమాలు నిర్వహించినా.. సక్సెస్ అవుతాయని భావించలేం. ఎందుకంటే ఆ పార్టీలకు క్షేత్రస్థాయిలో ఉన్న బలం తక్కువ. క్యాడర్ అంతంత మాత్రమే. దీంతో తెలుగుదేశం పార్టీ లేకుండా ఆ రెండు పార్టీలు ఏ కార్యక్రమాలు నిర్వహించలేవని సంకేతాలు తప్పకుండా బయటకు వస్తాయి. టిడిపి నాయకత్వానికి అదే అవసరం. తమ బలాన్ని చూపించేందుకు టిడిపి ఒక్కటే కార్యక్రమం నిర్వహించుకోవడం విశేషం.
Also Read: ఇక జగన్ నే దిక్కు.. వల్లభనేని వంశీ డిసైడ్ అయ్యాడా?
టిడిపి మార్క్ పాలిటిక్స్..
తెలుగుదేశం పార్టీ మార్కు రాజకీయం( mark politics ) ఎప్పుడు ఇలానే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ప్లస్ కూడా ఇదే. ఆ రెండు పార్టీల శ్రేణులు లేకపోవడంతో టిడిపి కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇది టిడిపి ప్రభుత్వమని ప్రజలకు సంకేతాలు పంపగలుగుతున్నారు. ఒకటి మాత్రం నిజం. రాజకీయాలు ఒకేలా ఉండవు. అధికారం శాశ్వతం కాదు. కానీ ప్రతి రాజకీయ పార్టీకి వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు అదే వ్యూహాలను అమలు చేస్తోంది తెలుగుదేశం పార్టీ. అంతకుమించి ఈ విషయంలో విశ్లేషించలేం కూడా..