Atmasakshi Survey 2023: ఏపీలో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థలు చేపడుతున్న సర్వేల్లో వైసిపి గెలుపు పక్కగా కనిపిస్తోంది. కానీ ఆత్మసాక్షి సర్వేలో మాత్రం అందుకు విరుద్ధ ఫలితాలు వెల్లడయ్యాయి. రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి భారీ విజయంతో అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వే తేల్చి చెప్పింది. మొత్తం 54 శాతం ఓట్లతో కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో తాజా సర్వే ఏపీలో సంచలనంగా మారింది.
గత ఎన్నికల్లో వైసిపి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 175 అసెంబ్లీ స్థానాలు గాను.. 151 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు, జనసేన ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లను వైయస్సార్సీపి సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 39 శాతం ఓటు షేర్ ను సాధించింది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం 11 గా ఉండేది. అయితే అది ఇప్పుడు తారుమారైనట్టు ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది. రెండేళ్ల కిందట ఇదే సర్వేలో టిడిపికి వైసిపి కంటే నాలుగు శాతం ఓట్లు అదనంగా వస్తాయని తేలింది. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం, జనసేన కూటమికి 54% ఓట్లు వస్తాయని తేల్చి చెప్పింది. వైసిపి 43 శాతానికి పరిమితం కానుందని తేల్చింది. వైసిపి కంటే టిడిపి, జనసేన కూటమి 11% ఓట్లతో ఏపీలో అధికారంలోకి రానుందని స్పష్టం చేసింది.
తెలుగుదేశం పార్టీకి 44 శాతం ఓట్లు, జనసేనకు 10 శాతం ఓట్లు దక్కనున్నాయని ఈ సర్వేలో తేలింది. మున్ముందు ఈ ఓటు శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైనట్లు ఆత్మ సాక్షి పేర్కొంది. చంద్రబాబు అరెస్ట్, జనసేనతో పొత్తు ప్రకటన తర్వాత కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపినట్లు స్పష్టమైంది. చంద్రబాబు అరెస్టుతో సానుభూతి పెరిగిందని.. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని పవన్ ప్రకటన తర్వాత కూడా స్పష్టమైన మార్పు వచ్చినట్లు తేలింది. సామాజిక వర్గాలు, పేద, మధ్యతరగతి ప్రజలను విభజించి వారి మూడ్ను శాంపిల్స్ రూపంలో సహకరించినట్లు ఆత్మ సాక్షి సర్వే ప్రతినిధులు చెబుతున్నారు.
ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలింది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సిపిఎస్ రద్దు హామీ, సమస్యల పరిష్కరించడంలో జగన్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటివరకు ఉద్యోగుల భర్తీ పై దృష్టి పెట్టకపోవడం కూడా జగన్ సర్కార్కు మైనస్ గా మారింది. అటు అర్బన్ ఓటర్లు సైతం ప్రభుత్వం తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. గ్రామీణ ఓటర్లు మాత్రం వైసిపి వైపే కాస్త మొగ్గు చూపుతున్నట్లు తేలింది. మొత్తానికైతే ఆత్మ సాక్షి సర్వేలో ఏపీ ప్రజలు వైసీపీకి ఝలక్ ఇచ్చారు.