TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పండుగ మహానాడు వేడుకగా జరుగుతోంది. మంగళవారం తొలిరోజు కార్యక్రమాలను దిగ్విజయంగా జరుపుకుంది. చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి టిడిపి అధ్యక్షులు మాట్లాడారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సైతం తనదైన శైలిలో ప్రసంగించారు. తొలిరోజు కార్యక్రమాలకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగం అత్యంత హైలెట్ గా నిలిచింది. లోకేష్ ఆరు శాసనాలను ప్రవేశపెట్టారు. వాటిపై ప్రధానంగా మహానాడులో చర్చ జరగనుంది. రాష్ట్రం నలువైపుల నుంచి టిడిపి శ్రేణులు తరలిరావడంతో మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారింది. మరోవైపు మహానాడుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.
* కష్టకాలంలో అండగా పవన్..
గత ఏడాది మహానాడు( mahanadu) జరగలేదు. సార్వత్రిక ఎన్నికలు కావడంతో నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ ఎన్నికల్లో జనసేనతో పాటు బిజెపితో పోటీ చేసి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టిడిపి కష్టకాలంలో ఉండగా అండగా నిలిచారు. అక్రమ కేసుల్లో చంద్రబాబు అరెస్టు సమయంలో స్వయంగా పరామర్శించారు. నేరుగా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. బిజెపిని సైతం ఈ కూటమిలోకి తెస్తానని చెప్పుకొచ్చారు. అప్పటివరకు టిడిపి, బిజెపి మధ్య అభిప్రాయ బేధాలు కొనసాగేవి. అటువంటి సమయంలో బిజెపిని టిడిపి కూటమిలోకి తేవడం.. కూటమి సక్సెస్ కావడం.. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ఏపీలో కూటమి కీలకం కావడం వంటివి జరిగిపోయాయి. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు చాలా ఉదారంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ సైతం టిడిపి తో పాటు చంద్రబాబు విషయంలో అదే స్థాయిలో స్పందిస్తుంటారు. ఇప్పుడు మహానాడు పై కూడా పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో స్పందించారు.
Also Read : పీక కోస్తున్నా జై తెలుగుదేశం అన్నాడు.. చంద్రబాబు చెప్పిన చంద్రయ్య కథ
* జనసేన తరఫున శుభాకాంక్షలు..
తెలుగుదేశం పార్టీ ఏటా మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అది ఒక చారిత్రక, రాజకీయ వేడుక అని… పండగ వాతావరణం లో మహానాడు ను జరుపుకోవడం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
* ఆరు అంశాలపై బలమైన చర్చ..
తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది మహానాడు అంటూ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుకు చాలా ప్రాధాన్యత ఉందని.. మహానాడు అనే పదం విన్న.. చదివిన వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ఈ మూడు రోజుల పాటు ప్రజాసేవ, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా జరుపుతున్న ఈ వేడుకల్లో చర్చించునున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యువగళం, కార్యకర్తే అధినేత, పేదల ప్రగతి, సామాజిక న్యాయం, అన్నదాతకు అండ వంటి అంశాలపై మహానాడులో బలమైన చర్చ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహానాడు విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు పవన్. పవన్ ఇచ్చిన సందేశానికి టిడిపి శ్రేణులు ఫిదా అవుతున్నాయి.