AP Politics: ఏపీలో కూటమికి సంబంధించి సీట్ల కేటాయింపులు సస్పెన్స్ కు తెరపడటం లేదు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు , వస్తున్నారు. కానీ ఏ విషయం మీద స్పష్టత ఇవ్వడం లేదు. అమిత్ షా తో ఆ మధ్య భేటీ అయినప్పుడు టిడిపి అనుకూల మీడియా ఒకరకంగా రాసింది. సాక్షి మరో రకంగా రాసింది. వాస్తవంగా మాత్రం సీట్ల ఇంకా పూర్తి కాలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. పోనీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాతయినా సీట్ల కేటాయింపు జరుపుతారా? అంటే అది కూడా లేనట్టు కనిపిస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలో ఎన్నికల్లో టిడిపి, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని భావిస్తున్నాయి. 2014 మాదిరి ఎన్నికల్లో తలపడాలని నిర్ణయించుకున్నాయి. అయితే టికెట్ల కేటాయింపునకు సంబంధించి ఇంతవరకు కసరత్తు పూర్తి కాలేదు. పలుమార్లు సమావేశమైనప్పటికీ అది ఒక తుది రూపు సంతరించుకోలేదు.. ఇప్పటికే వైసిపి పలు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించింది. మరికొన్ని స్థానాల్లో కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటివరకు కూటమి కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. వారి పేర్లు మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్నా మొన్నటివరకు జనసేన, టిడిపి మధ్య పొత్తు ఉంటుందని అందరూ భావించారు. అయితే ఆకస్మాత్తుగా ఇందులోకి బిజెపి చేరడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. బిజెపిని చేర్చుకోవడం చంద్రబాబు నాయుడికి అనివార్యం.
ప్రస్తుతం బిజెపి ఏపీలో 10 ఎంపీ సీట్లు, 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం నాలుగు నుంచి ఆరు ఎంపీ సీట్లు, పది అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం అందుతోంది. అయితే బిజెపి టిడిపి టిడిపికి బలమైన నియోజకవర్గాలను కోరుతున్న నేపథ్యంలో ఆయన పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. టిడిపికి విపరీతమైన పట్టు ఉన్న విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, నర్సాపురం స్థానాలను బిజెపి కోరుతోంది. టిడిపి నుంచి బిజెపికి రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురం ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే బిజెపి మాత్రం ఎనిమిది స్థానాలకు తగ్గేది లేదనే సంకేతాలు ఇస్తోందని సమాచారం. అసెంబ్లీ స్థానాలు 10 వరకు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం కాగా.. బిజెపి మాత్రం 15కు తక్కువ కావద్దని అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే విషయంపై తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్టు తెలుస్తోంది. ఒకవేళ సీట్ల విషయంలో బిజెపి పట్టుబడితే పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపి సమస్యను పరిష్కరించే యోచన లో చంద్రబాబు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ పది రోజుల్లో సీట్ల కేటాయింపు మొత్తం పూర్తవుతుందని టిడిపి వర్గాలంటున్నాయి.