Telangana TDP: తెలంగాణలో( Telangana) పార్టీ బలోపేతం పై చంద్రబాబు ఫోకస్ పెట్టారా? మెల్లగా పార్టీని యాక్టివ్ చేయాలని చూస్తున్నారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారా? గ్రేటర్ విశాఖలో సత్తా చాటాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఇలానే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట తెలంగాణ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకుండా.. క్రమేపి పార్టీని యాక్టివ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వివిధ కారణాలతో పార్టీని వీడిన వారిని రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బిఆర్ఎస్ లో ఉన్న పూర్వ టిడిపి నేతలతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో యాక్టివ్ కావడం ఖాయం. అయితే మొన్నటి చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ ఉద్దేశం కూడా అదేనని తెలుస్తోంది.
* రెండేళ్లుగా అధ్యక్ష పదవి ఖాళీ..
అయితే ముందుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) అధ్యక్ష స్థానాన్ని భర్తీ చేస్తారని తెలుస్తోంది. 2023 తెలంగాణ ఎన్నికలకు ముందు తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. అప్పటినుంచి టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. తెలంగాణలో ఎన్నికలు జరిగిన సమయానికి ఏపీలో చంద్రబాబు అరెస్టయ్యారు. 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉండి పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది తెలుగుదేశం పార్టీ. అయితే చంద్రబాబు నిర్ణయాన్ని విభేదించారు కాసాని జ్ఞానేశ్వర్. అప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేయగలిగారు జ్ఞానేశ్వర్. పోటీ నుంచి తప్పుకోవడంతో జ్ఞానేశ్వర్ పునరాలోచనలో పడ్డారు. కెసిఆర్ పిలుపుతో బి ఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కానీ అప్పటి నుంచి టీటీడీపీ అధ్యక్ష పదవిని భర్తీ చేయలేదు చంద్రబాబు.
* ముగ్గురు మధ్య పోటీ..
అయితే ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం ముగ్గురు నేతల మధ్య పోటీ జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు కృష్ణారెడ్డి. తరువాత టిడిపిని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. కానీ ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తీగల కృష్ణారెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏకంగా సైకిల్ ఎక్కేశారు. మరోవైపు మాజీ మంత్రి బాబు మోహన్ సైతం ముందుగా గులాబీ పార్టీలోకి వెళ్లారు. తరువాత బిజెపిలో చేరారు. చివరకు పాత పార్టీ సైకిల్ ఎక్కేశారు. అయితే ఈయన సైతం అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అరవింద్ కుమార్ గౌడ్ ఆ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఈయన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ మేనల్లుడు. పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. అయితే ఈ ముగ్గురు నేతల్లో ఎవరికో ఒకరికి పదవి ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.
* గులాబీ పార్టీ నుంచి నేతలు చూపు..
మరోవైపు గులాబీ పార్టీ నుంచి చాలామంది నేతలు టిడిపి వైపు వస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. మొన్న ఆ మధ్యన పార్టీ హైకమాండ్‌తో విభేదించిన కేసీఆర్ కుమార్తె కవిత టిడిపిలో చేరుతారని తెగ ప్రచారం నడిచింది. మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి, నామా నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన కమ్మ సామాజిక వర్గం నేతలు ఎక్కువగా టిడిపి వైపు టర్న్ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే చంద్రబాబు సైతం స్థానిక రాజకీయాలను అనుసరించి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థలతోపాటు జీవీఎంసీ ఎన్నికల్లో ఉనికి చాటుకొని.. క్రమేపి పార్టీని అభివృద్ధి చేసి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.