TDP: ఎన్నికల కార్యాచరణ పై టిడిపి ఫోకస్ పెట్టింది. సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. ఎవరెవరు ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు అన్నదానిపై ఫుల్ క్లారిటీ వచ్చింది.ఇక భాగస్వామ్య పక్షాలతో ఎన్నికల ప్రచారం.. నియోజకవర్గాల్లో ఎలా ముందుకెళ్లాలి? అన్న అంశాలపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికలకు ఉన్న 55 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుంది.
పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి 144 అసెంబ్లీ సీట్లు, 17 పార్లమెంట్ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. అయితే తొలి జాబితాలో 94 మంది అసెంబ్లీ అభ్యర్థులను, రెండో జాబితాలో మరో 34 మంది అభ్యర్థులను టిడిపి ప్రకటించింది. ఇంకా కేవలం 16 స్థానాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు 17 పార్లమెంట్ స్థానాలకు సైతం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. గురు లేదా శుక్రవారాల్లో అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించడానికి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. కొన్ని సీట్ల విషయంలో బిజెపితో ముడిపడి ఉండడంతోనే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ వీలైనంత త్వరగా అభ్యర్థుల విషయంలో కొలిక్కి తేవడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈనెల 26 నుంచి చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రతి పార్లమెంట్ స్థానంలో సభలు నిర్వహిస్తారు. రోజుకో లోక్ సభ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం ఒక శాసనసభ నియోజకవర్గంలో పదివేల మందితో సభ నిర్వహిస్తారు. సాయంత్రం 4:30 గంటలకు మరో నియోజకవర్గంలో పర్యటిస్తారు. రాత్రి 7:30 గంటలకు మరో నియోజకవర్గంలో రోడ్ షో జరుపనున్నారు. అంటే రోజుకు మూడు అసెంబ్లీ స్థానాల్లో పర్యటన ఉంటుందన్నమాట. ఈనెల 26 నుంచి సుమారు 20 రోజులు పాటు ఎన్నికల ప్రచార సభలు కొనసాగనున్నాయి. మరోవైపు ఈ నెల 24, 25 తేదీల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 26 నుంచి ప్రజాగళం సభలు ప్రారంభం కానున్నాయి. మొత్తానికైతే టిడిపి ఎన్నికల ప్రచారంతో హోరెత్తించనుంది.